MLA Yasaswini Reddy Palakurthy Congress Booth Level Training Programme
* అంకిత భావముతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలు
– ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, పాలకుర్తి: బూత్ స్థాయి నుంచే పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.
మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ స్థాయి శిక్షణ సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , బూత్ లెవల్ ఏజెంట్స్ శిక్షణ ట్రైనర్ అల్లం కోటేశ్వరరావు టీపీసీసీ అబ్జర్వర్ ప్రమోద్ కుమార్ , జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుంచే కృషి చేయాలని, పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఓటరుతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు..
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత అని అన్నారు. ప్రతి బూత్‌లో పార్టీకి బలమైన నిర్మాణం అవసరమని, దానికోసమే ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల్లో విజయానికి బూత్ మేనేజ్మెంట్ ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం సమిష్టిగా కష్టపడితే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అపార మెజారిటీ సాధ్యమవుతుందని అన్నారు. గ్రామ స్థాయిలో బూత్ కమిటీలను మరింత చురుకుగా పనిచేయించే బాధ్యత నాయకులపై ఉందన్నారు.
శిక్షణ ట్రైనర్ అల్లం కోటేశ్వరరావు బూత్ లెవల్ ఏజెంట్లకు ఎన్నికల నిబంధనలు, ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, సవరణలు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు. ప్రతి బూత్‌లో పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించేందుకు వ్యూహాత్మకంగా పనిచేయాలని సూచించారు.
టీపీసీసీ అబ్జర్వర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయడంలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
