Aarogyasri Manda Krishna Madiga
ఆకేరు న్యూస్, భీమదేవరపల్లి :
తెలుగు రాష్ట్రాల్లోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సహాయం అందిస్తున్న ప్రతిష్టాత్మక ‘ఆరోగ్యశ్రీ’ పథకం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాట ఫలమేనని ఎమ్మార్పీఎస్ నాయకులు కొనియాడారు.మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని అంబేడ్కర్ కూడలి వద్ద “ఆరోగ్యశ్రీ పథకం సాధన దినోత్సవం”కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ మాట్ల వెంకటస్వామి మాదిగ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్రక ఉద్యమాన్ని గుర్తుచేశారు. 2004వ సంవత్సరంలో గుండె సంబంధిత తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది పేద చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మహోద్యమం ప్రారంభమైందని తెలిపారు. నాటి ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా సాగిన ఆ పోరాటం వల్లనే, నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా అత్యుత్తమ వైద్యం లభిస్తోందని, ఆ ఉద్యమ ఫలితంగానే ‘ఆరోగ్యశ్రీ’ పథకం రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. సమాజంలో మానవీయ కోణంలో ఉద్భవించే అనేక ప్రజా పోరాటాలకు మందకృష్ణ మాదిగ నిలువెత్తు రూపమని ఆయన ప్రశంసించారు. కేవలం ఆరోగ్యశ్రీ పథకం సాధించడమే కాకుండా, సమాజంలో అత్యంత వెనుకబడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పెంపు కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేసిన ఘనత ఎమ్మార్పీఎస్ మరియు మాదిగ దండోరా ఉద్యమానికే దక్కుతుందని స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ఎమ్మార్పీఎస్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకట్ స్వామి మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు సిక సురేష్, భీమదేవరపల్లి కో-ఇన్చార్జ్ వేల్పుల ప్రశాంత్ మాదిగ, సీనియర్ నాయకులు ఐలపాక స్వామి, వికలాంగుల పోరాట సమితి మండల అధ్యక్షుడు పెండాల కుమారస్వామి, బహుజన నాయకులు బుస్మల్ల రాజు, వెంకన్న, రాజన్న, గజ్జల వెంకటస్వామి, ఆంజనేయులు, మాడుగుల అశోక్, మాడుగుల ప్రభుదాస్, కాదాస్ ప్రవీణ్, నాగిన్ల చందర్, నాగిన్ల శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
