CPI Protest Against Modi Government
ఆకేరు న్యూస్, భీమదేవరపల్లి:
కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలే దాని పతనానికి దారి తీస్తాయని, దేశంలో మార్పు కోసం ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపే వరకు సీపీఐ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ చేపట్టిన ప్రచార జాత పాదయాత్ర రెండవ రోజు శుక్రవారం హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని సహకార బ్యాంకు నుండి కొత్తపల్లి వరకు ఉత్సాహపూరితంగా సాగింది. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మొదటగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా చేయలేదని, రాజ్యాంగ స్ఫూర్తిని క్రమబద్ధంగా దెబ్బతీస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. సాధారణ పౌరులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశంలోని సహజ వనరులను కార్పొరేట్ మిత్రులు అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, విద్య మరియు ఆరోగ్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, దళితులు మరియు మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులను తక్షణమే నిలిపివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభమైన సీపీఐ పాదయాత్రలు వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణాల గుండా సాగుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతాయని వివరించారు. ఈ పోరాట యాత్ర సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో భారీ మహా ర్యాలీతో ముగుస్తుందని తెలిపారు. ఈ ప్రచార జాత పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, ఎన్ ఎ స్టాలిన్, బీమదేవరపల్లి మండల కార్యదర్శి అదరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
