Akkineni Nagarjuna Cyber Crime Experience
* వారానికి ఒకసారి పాస్వర్డ్ మార్చాల్సిందే – నాగార్జున
ఆకేరు న్యూస్, హైదరాబాద్: డిజిటల్ యుగంలో సాంకేతికత పెరిగేకొద్దీ దానితో పాటు సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. సామాన్యులే కాకుండా సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా సైబర్ కేటుగాళ్ల బారిన పడుతుండటం గమనార్హం. తాజాగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) నిర్వహించిన ‘సురక్షా కా తిరంగా’ సైబర్ అవగాహన సదస్సులో ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పాల్గొని తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. “నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే” అని ఆయన సభాముఖంగా వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
* బ్యాంక్ అధికారి పేరుతో ట్రాప్..
సదస్సులో నాగార్జున మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలో సైబర్ నేరగాళ్లు సృష్టించిన కలకలాన్ని వివరించారు.
“సుమారు ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తి తనకు తాను బ్యాంక్ అధికారిగా పరిచయం చేసుకుంటూ నన్ను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు. వేర్వేరు పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు” అని నాగార్జున పేర్కొన్నారు.
* కుటుంబ సభ్యులకు ‘డిజిటల్ అరెస్ట్’ భయాలు…
ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ వ్యాపారం తన ఇంట్ వరకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. “మా కుటుంబంలోని కొందరిని డిజిటల్ అరెస్ట్లు చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు” అని నాగార్జున సంచలన విషయాలు వెల్లడించారు.
* వారానికి ఒకసారి పాస్వర్డ్ ఛేంజ్…
సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు. తాను తీసుకుంటున్న స్వీయ జాగ్రత్తలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
నాగార్జున తన మొబైల్లో సెక్యూరిటీ కారణాల దృష్ట్యా కనీసం ఫొటోలు కూడా తీయడానికి ఇష్టపడనని చెప్పారు. సైబర్ దాడులు, హాకింగ్ బారిన పడకుండా ఉండటానికి ప్రతీ వారానికి ఒకసారి తన డిజిటల్ ఖాతాలు, మొబైల్ పాస్వర్డ్లను కచ్చితంగా మారుస్తుంటానని తెలిపారు.
* సీవీ ఆనంద్, సజ్జనార్లపై ప్రశంసల జల్లు..
తెలుగు చిత్ర పరిశ్రమను కలవరపెడుతున్న పైరసీ మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ పోలీస్ శాఖ వహిస్తున్న పాత్రను నాగార్జున ప్రత్యేకంగా కొనియాడారు. ఫిల్మ్ పైరసీని అరికట్టడానికి సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, సజ్జనార్ అద్భుతంగా కృషి చేశారని ప్రశంసించారు. సినీ పరిశ్రమ హక్కులను కాపాడటంలోనూ, పైరసీ నెట్వర్క్ల నడుము విరవడంలోనూ తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచారని కితాబిచ్చారు.
సమాజంలో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమం ఎంతో అభినందనీయమని, ప్రతీ ఒక్కరూ డిజిటల్ భద్రతా నియమాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని నాగార్జున పిలుపునిచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
