Warangal Bus Stand Construction
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంలో ఏడేళ్లుగా అసంపూర్తిగా దర్శనమిస్తున్న కొత్త బస్టాండ్ నిర్మాణ పనుల జాప్యంపై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా.. నేటికీ కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడం అధికారుల, పాలకుల అలసత్వానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వరంగల్ బస్టాండ్ ఆవరణలో ప్రముఖ సామాజిక కార్యకర్త చందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అసంపూర్తి నిర్మాణ పనులను, తాత్కాలిక షెడ్డులో ఎదురవుతున్న నరకయాతనను వివరిస్తూ నినాదాలు చేశారు.
* ‘బర్ల షెడ్లూ నయం’ అంటూ ఎద్దేవా…
ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తాత్కాలిక రేకుల షెడ్డు తీవ్ర అధ్వానంగా తయారైందని బాధితులు వాపోయారు. చిన్నపాటి వర్షం కురిసినా షెడ్డు మొత్తం నీటితో నిండిపోయి, ప్రయాణికులు నిలబడటానికి కూడా చోటు లేక చుక్కలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక రేకుల షెడ్డు కంటే పాడి పశువుల కోసం వేసే బర్ల, గొర్ల షెడ్డులే వేయి రెట్లు నయం!” అని నిరసనకారులు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
* అధికారులపై తీవ్ర ఆగ్రహం..
రోజుకు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే వరంగల్ జిల్లా కేంద్ర బస్టాండులో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతమొత్తుకున్నా ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే “దున్నపోతు మీద వాన పడ్డట్లు, చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే ఉందె తప్ప ఏమాత్రం చలనం లేదు” అని చందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
* ఆగస్టు 20న ‘ఒంటరి నిరాహార దీక్ష’ హెచ్చరిక…
ప్రయాణికులు పడుతున్న అవస్థలపై అధికారులు తక్షణమే స్పందించి, నయా బస్టాండ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారుల్లో మార్పు రాకపోతే, ఈ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన ఆర్టీసీ రీజినల్ కార్యాలయం ఎదుట ‘ఒక రోజు ఒంటరి నిరాహార దీక్ష’ చేపడతానని సామాజిక కార్యకర్త చందర్ రెడ్డి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి పనులు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
