* చిత్రపరిశ్రమ సమస్యలపై చర్చ
* సత్కారానికి సీఎం అపాయింట్మెంట్ కోరాం
* త్వరలో పవన్‌ను, చంద్రబాబును సత్కరిస్తాం : అరవింద్
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan kalyan ) తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి సత్కరించారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్‌తో చర్చించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ( Film Chamber ) అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ పాటు అల్లు అరవింద్, అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), బోగవల్లి ప్రసాద్, డి.వీ.వీ.దానయ్య, సుప్రియ, ఎన్.వీ.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీ.జీ.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు పవన్ కల్యాణ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. భేటీ అనంతరం నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ తరఫున సత్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అపాయింట్మెంట్ ఇప్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ను కోరినట్లు తెలిపారు. త్వరలోనే ఇద్దరినీ సన్మానిస్తామని వెల్లడించారు. దీనికి పవన్ సానుకూలంగా స్పందించారని, మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నామని వివరించారు. త్వరలో మళ్లీ ఇండస్ట్రీ తరఫున రిప్రజెంటేషన్ తో వచ్చి, అన్నీ సమగ్రంగా మాట్లాడతామని తెలిపారు.
————————-