Fishermen Leaders Arrest Protest
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
మత్స్యకారులు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు నిరసన తెలిపిన టిఎంకె ఎంకేఎస్ నాయకుల అరెస్టు అమానుషం అని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జనగామ జిల్లా కార్యదర్శి మునిగెల రమేష్ అన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కోహెడలో శుక్రవారం మత్స్య శాఖ మంత్రి వాకటి శ్రీహరి పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారుల సమస్యలను ప్రస్తావిస్తూ చేపట్టిన నిరసనను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల్లల బాలకృష్ణతో పాటు నిరసన తెలిపిన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో వేలాది మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నప్పటికీ, ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీ పేరుతో అవినీతి, జాప్యం, నాణ్యత సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివల్ల మత్స్య సహకార సంఘాలకు ఆశించిన ప్రయోజనం కలగడం లేదని పేర్కొన్నారు. అందువల్ల చేప పిల్లలు సరఫరా చేసే విధానాన్ని రద్దు చేసి వాటి విలువకు సమానమైన మొత్తాన్ని నేరుగా మత్స్య సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘాలే స్థానిక అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
విధి నిర్వహణలో లేదా ప్రమాదాల కారణంగా మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా, బీమా సాయం ఇప్పటికీ అందని అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న అన్ని చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
మత్స్యకారులు పట్టిన చేపలను అమ్ముకునేందుకు సరైన మార్కెట్ సౌకర్యాలు లేక మధ్యవర్తుల దోపిడీకి గురవుతున్నారని, అందువల్ల ప్రతి జిల్లా కేంద్రంలో శీతలీకరణ (కోల్డ్ స్టోరేజ్) సదుపాయాలతో కూడిన ఆధునిక చేపల మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను పరిష్కరించకుండా ఈ అణచివేత ధోరణి ఇలాగే అవలంబిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
