* ఏపీలోని కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి 2 వరకూ పోలింగ్
* పోలింగ్ సరళిపై పార్టీల చర్చోపచర్చలు
* ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ.., తెలంగాణలో 17 లోక్‌సభకు చెందిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం నిశ్చింతగా ఉండలేకపోతున్నారు. ఓటర్లు ఎవరికి ఓటేశారు.., ఎవరికి వేటు వేశారో తెలియక ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కేంద్రాల్లో సోమవారం అర్దరాత్రి దాటాక కూడా 2 వరకు పోలింగ్ కొనసాగినట్లు అధికారులు ప్రకటించడం ఉత్కంఠగా మారింది. గత ఏడాది పోలింగ్ శాతం 79.08 నమోదు కాగా, ఈసారి 81 శాతం దాటొచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలిస్తుందో, ఎవరికి ప్రతికూలంగా మారుతుందో అంచనా వేయలేక రాజకీయ పార్టీలు అయోమయంలో ఉన్నాయి.
పైకి ధీమా.. కానీ..
ఏపీ, తెలంగాణల్లో గెలుపుపై ఎవరికి వారు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.., లోలోన గుబులు రేపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉండడంతోనే ప్రజలు బయటకు వచ్చి, కసిగా ఓటింగ్‌లో పాల్గొన్నారని కూటమి నేతలు చెబుతున్నారు. వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఓటేయడం తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి దాటినా వెయ్యికిపైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగడం, 45 కేంద్రాల్లో ఆ సమయానికి మించే ఓటర్లు క్యూలో ఉండడంతో తమకు అనుకూలమో కాదో ఆ పార్టీ నేతలకు అంతుపట్టడం లేదు. విజయం తమదేనని పైకి వారు గంభీరంగా చెబుతున్నా.. మనసులో మాత్రం ఓటమి భయం వెంటాడుతోంది. వారి మాటల్లో కాస్త నైరాశ్యం కనిపిస్తోందని అధికార, విపక్ష సభ్యులు ఒకరి గురించి మరొకరు అనుకుంటున్నారు. కనీసం 100కు పైగా అసెంబ్లీ స్థానాలతో రెండోసారీ అధికారంలోనికి వస్తామని ఓ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే అన్నారు. అయితే వైసీపీ అగ్రనేతలు మాత్రం 130 సీట్లకు తగ్గవని లెక్కలు వేస్తున్నారు. మహిళలు, యువత భారీసంఖ్యలో తమకే ఓట్లేశారని అంటోంది.
అందుకు భిన్నంగా టీడీపీ
వైసీపీ నేతల అంచనాలకు భిన్నంగా ఏపీ ఫలితాలు ఉంటాయని టీడీపీ చెబుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, టీడీపీ కూటమి సూపర్‌సిక్స్ హామీల ప్రభావం ఈ ఎన్నికల్లో ఉంటుందని ఓ టీడీపీ సీనియర్ నేత ఆకేరు ప్రతినిధితో వెల్లడించారు. ఎన్నికలకు ముందు జగన్ వైనాట్ 175 అన్నారు. పోలింగ్ ముగిశాక 100 నుంచి 130 అంచనా వేసుకుంటున్నారు. వాస్తవంలో మేజిక్ ఫిగర్‌ను కూడా ఆ పార్టీ టచ్ చేసే అవకాశాలు లేవని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. 22 లోక్‌సభ స్థానాలు తమవే అన్నారు. ఏపీలో ఏర్పడబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అని జోష్యం చెప్పారు. వారణాసిలో మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఇలా..
మరోవైపు తెలంగాణలో కూడా పోలింగ్ శాతం పెరిగింది. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 64.74 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరో రెండు శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 62.07 శాతం పోలింగ్ జరిగింది. ప్రాథమిక వివరాల మేరకే ప్రస్తుతం ఈ శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే జరిగింది. మెజారిటీ సీట్లు తమవే అని ఇరు పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలోని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా మారుతుందని చెప్పారాయన. 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని కిషన్ రెడ్డి వెల్లడించారు. యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో తాము 14 సీట్లను గెలుచుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. కనిష్ఠంగా 11 సీట్లు తమకే దక్కుతాయంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో డీలా పడ్డ బీఆర్ఎస్.. పార్టీ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చి.. 12 నుంచి 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాఖా చూపెడతామంటూ ఓటర్లను కోరారు. ఈనేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమను ఆదరిస్తారన్న ధీమాతో బీఆర్ ఎస్ పార్టీ ఉంది. ఎవరి అంచనాలు నిజం అవుతాయో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగక తప్పదు.
—————————-