RTC Workers Strike Telangana
* రెండు రోజుల్లోనే సమ్మె ముగించి చారిత్రక విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం
* చారిత్రక విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ పిలుపు
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు , అధికార ప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు కార్మికుల తో చర్చలు జరిపిందని సామాజిక వేదిక ఎక్స్ ద్వారా తెలిపారు.
కార్మికుల చిరకాల స్వప్నం అయిన ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు,11 శాతం పీఆర్సీ ప్రకటన పై ఆర్టీసీ కార్మికులు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారని అని మంత్రి పొన్నం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మన కుటుంబ సభ్యులు కాబట్టి వారి సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఈ నేపథ్యంలో, పార్టీ క్యాడర్ అంతా క్షేత్రస్థాయిలో కార్మికులతో కలిసి ఈ విజయాలను వేడుకగా జరుపుకోవాలని, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 55 రోజుల సమ్మెలో ఏక్కడా హామీలు నెరవేర్చలేదనీ, 30 మందికి పైగా కార్మికులు మరణించారనీ ఆయన విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందనీ పేర్కొన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ శవ రాజకీయాలు చేయడం తగదని, సమ్మె సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరించిన తీరు సరికాదని అభిప్రాయపడ్డారు.
2013 బాండ్స్ చెల్లింపు, 2017 పీఆర్సీ, డీఏ, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు, కారుణ్య నియామకాలు, తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించడం వంటి సంక్షేమ చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కోసం ఇప్పటికే చేసిందని గుర్తు చేశారు.
రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పేదల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు ఆర్టీసీ లైఫ్ లైన్ గా పని చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలు త్వరగా అమలు చేస్తోందనడానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తన పోస్టులో తెలిపారు.
