Rahul Gandhi arrest
* ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి :
దేశరాజధాని ఢిల్లీలో ( New Delhi ) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో సోమవారం జంతర్‌మంతర్ (janthar Manthar ) వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. మంగళవారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) , కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) వద్రా నేతృత్వంలో కాంగ్రెస్ అగ్రనేతలు, ఎంపీలు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) అధికారిక నివాసం (Lok Kalyan Marg ) ముట్టడికి యత్నించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోకుండా విద్యార్థుల గొంతు నొక్కేస్తున్నారని మండిపడుతూ నేతలంతా ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.
* చేతులకు సంకెళ్ళతో నిరసన
కాంగ్రెస్ నాయకులు చేతులకు సంకెళ్లు వేసుకుని, “నిరంకుశత్వం నశించాలి.. విద్యార్థుల అణచివేత ఆపాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ ఆందోళనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నీట్ లీకేజీతో నాశనం చేశారని, దీనిపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం వెనకాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan ) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఇతర ఇండియా (INDIA) కూటమి నేతలు కూడా మద్దతు పలికారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు సైతం నేరుగా వచ్చి మద్దతు తెలిపారు.
* రాహుల్, ప్రియాంకల అరెస్ట్
ప్రధాని నివాసం వద్ద నిరసన తెలపడం భద్రతాపరంగా నిషేధిత ప్రాంతమని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, కేసీ వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలను నిర్బంధించి బలవంతంగా పోలీసు వ్యాన్లలోకి ఎక్కించి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిర్బంధంలోకి తీసుకుంటున్న సమయంలో ప్రియాంక గాంధీ మీడియా వ్యాఖ్యానిస్తూ.. “ప్రభుత్వం భయపడుతోంది.. విద్యార్థుల హక్కుల కోసం పోరాడే మమ్మల్ని ఎంత అణిచివేసినా వెనక్కి తగ్గేది లేదు” అని స్పష్టం చేశారు.
* బాధితలకు పరామర్శ
ఈ నిరసనకు దిగడానికి ముందే రాహుల్, ప్రియాంకలు సోమవారం నాటి లాఠీచార్జ్‌లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను ఆర్.ఎమ్.ఎల్ (RML) ఆస్పత్రిలో పరామర్శించారు.ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న తమ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఈ పోరాటం మున్ముందు ఇంకా తీవ్రతరం అవుతుందని హెచ్చరించాయి.
————————–
