Repalle Narottam Suri, Be Human Forum convener Warangal
* విలువలతో జీవించే మనుషులను సమాజంలోకి ఆహ్వానించాలి
– బీ హ్యూమన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రేపల్లె నరోత్తం సూరి
అకేరు న్యూస్, వరంగల్: రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక మాత్రమే కాదని.. మానవీయ విలువలను గౌరవిస్తూ మనుషులను ఒకరితో ఒకరు కలిపే వేదికగా కూడా నిలవాలని బీ హ్యూమన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రేపల్లె నరోత్తం సూరి అన్నారు.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నరోత్తం సూరి నివాసంలో ప్రత్యేక మానవీయ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఇటీవల దండకారణ్య ప్రాంతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన చందర్, ఆయన సతీమణి గంగాలను కుటుంబ సభ్యులు ఆత్మీయంగా ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగా తన జీవితంలో తొలిసారిగా కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టి, వారితో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు.
* చదువు కంటే విలువలే గొప్పవి
గంగా గారికి పాఠశాల విద్య, అధికారిక అక్షరజ్ఞానం లేకపోయినా.. జీవితానుభవం ద్వారా ఆమె సంపాదించుకున్న నిజాయితీ, నిబద్ధత, ధైర్యం, మానవీయత, విలువలు ఎంతో గొప్పవని నరోత్తం సూరి పేర్కొన్నారు.
ఒక వ్యక్తి గొప్పతనం అతను ఎంత చదువుకున్నాడనే దానిలో లేదని.. తాను నమ్మిన విలువలను జీవితంలో ఎంత నిజాయితీగా ఆచరిస్తున్నాడన్నదే అసలైన ప్రమాణమని అన్నారు. గంగా గారి ఆలోచనా విధానం, స్పష్టత, నిబద్ధత తమను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు.
ప్రస్తుత సమాజంలో విద్యావంతులుగా, ఉన్నత స్థానాల్లో ఉన్నవారిలో సైతం విలువల సంక్షోభం కనిపిస్తోందని నరోత్తం సూరి అన్నారు. అలాంటి సమయంలో అధికారిక విద్య లేకపోయినా నైతిక విలువలను ఆచరణలో చూపిస్తున్న గంగా వంటి వ్యక్తులను సమాజం గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. “ఒక వ్యక్తి రాజకీయ సిద్ధాంతాలతో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ వ్యక్తిలోని నిజాయితీ, నిబద్ధత, నైతిక విలువలు, మానవీయ గుణాలను గౌరవించడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు” అని నరోత్తం సూరి పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ మానవీయ సంబంధాలను బలోపేతం చేయడమే నిజమైన ప్రజాస్వామ్య సంస్కృతికి నిదర్శనమన్నారు.
* పునరేకీకరణకు సమాజం కూడా భాగస్వామి కావాలి
ప్రభుత్వాలు పునరావాసం, ఆర్థిక సహాయం, గౌరవంతో పాటు తిరిగి సాధారణ జనజీవనంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలకు సమాజం కూడా మానవీయంగా సహకరించాలని బీ హ్యూమన్ ఫోరం పిలుపునిచ్చింది. కేవలం ప్రభుత్వ చర్యలతోనే సామాజిక పునరేకీకరణ పూర్తికాదని.. కుటుంబ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం, మానసిక భరోసా కల్పించవచ్చని పేర్కొంది.
* ఆత్మీయంగా రాఖీ వేడుకలు
ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త అడ్వకేట్ అబ్దుల్ నబీ, జైసింగ్ రాథోడ్, పలువురు సామాజిక ఉద్యమకారులు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, విలేకరి మిత్రులు పాల్గొన్నారు. గంగా గారి నైతిక విలువలు, సామాజిక చైతన్యం, నిబద్ధతను గుర్తించిన పలువురు విలేకరి మిత్రులు కూడా ఆమె చేత రాఖీలు కట్టించుకున్నారు. దీంతో రాఖీ వేడుకలు మరింత ఆత్మీయంగా మారాయి.
* గతం కాదు.. విలువలే మనిషికి గుర్తింపు
వ్యక్తి గతం, విద్య, నేపథ్యం లేదా రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా అతడిని శాశ్వతంగా సమాజానికి దూరం చేయకూడదని బీ హ్యూమన్ ఫోరం స్పష్టం చేసింది. విలువలతో జీవించే ప్రతి మనిషిని గుర్తించి, గౌరవించి సామాజిక జీవితంలో భాగస్వామిని చేయాలని పిలుపునిచ్చింది.
“పండుగలు కేవలం మన కుటుంబాలకే పరిమితం కాకుండా.. సమాజంలోకి తిరిగి వస్తున్న ప్రతి విలువైన మనిషిని మనతో కలుపుకునే మానవీయ వేదికలుగా మారాలి. ప్రేమ, గౌరవం, ఆత్మీయతతో వారిని మనలో భాగం చేసుకున్నప్పుడే నిజమైన సామాజిక పునరేకీకరణ సాధ్యమవుతుంది” అని నరోత్తం సూరి అన్నారు.
అసమానతలు లేని, ప్రేమాభిమానాలు, పరస్పర గౌరవం, మానవీయ విలువలు, ప్రజాస్వామ్య భావనలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని బీ హ్యూమన్ ఫోరం కోరింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
