Revanth Reddy
* ఎవరీ ఆర్యదాన్ మహమ్మద్.
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేరళకు చెందిన ఆర్యదాన్ మహమ్మద్ మెమోరియల్ అవార్డు లభించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా రేవంత్‌రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో అసలెవరీ ఆర్యదాన్ మహమ్మద్..? రేవంత్‌రెడ్డికి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు..? అవార్డు ఇచ్చింది కేరళ ప్రభుత్వమేనా? అనే చర్చ జరుగుతోంది.
ఎవరీ ఆర్యదాన్ మహమ్మద్..?
1935 మే 15న కేరళలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ మహమ్మద్ జన్మించారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన కేరళ రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా ఎదిగారు. వ్యవసాయదారుడిగా, రాజకీయ, ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా ప్రజాజీవితాన్ని ప్రారంభించారు. నిలంబూర్ ప్రాంతంలోని ప్లాంటేషన్ కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఆయన రాజకీయ జీవితానికి పునాదిగా మారింది. మలప్పురం జిల్లాలోని నిలంబూర్ నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977 నుంచి 1982 మినహా వరుసగా విజయాలు సాధించారు.
కేరళ ప్రభుత్వాల్లో నాలుగు దఫాలుగా మంత్రిగా పనిచేసిన ఆయన.. కార్మిక, అటవీ, పర్యాటక, విద్యుత్, రవాణా వంటి కీలక శాఖలను నిర్వహించారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలు, కార్మికుల సంక్షేమం, ప్రజా సంక్షేమ పాలనకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ పేర్కొంటోంది. ఆర్యదాన్ మహమ్మద్ 2022 సెప్టెంబర్ 25న 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
అవార్డు ఇచ్చింది కేరళ ప్రభుత్వం కాదు
రేవంత్‌రెడ్డికి లభించిన అవార్డును కేరళ ప్రభుత్వం అందించిందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇది కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం కాదు. ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్, ఆర్యదాన్ అనుస్మరణ సమితి సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. ఆర్యదాన్ మహమ్మద్ జ్ఞాపకార్థం 2023లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. తొలి అవార్డును కేరళ అసెంబ్లీలో ఉత్తమ శాసనసభ్యుడు/పార్లమెంటేరియన్ విభాగంలో అప్పటి ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్‌కు అందించారు. 2024లో రెండో ఆర్యదాన్ మహమ్మద్ మెమోరియల్ అవార్డును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అందించారు.
రేవంత్‌రెడ్డికి ఎందుకు?
ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల కోసం రేవంత్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు, ఆయన నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అవార్డు ఎంపిక జ్యూరీలో ఎంపీ బెన్నీ బెహనాన్, కేరళ రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్‌కుమార్, రచయిత, మేధావి కల్పెట్ట నారాయణన్ ఉన్నారు.
రూ.లక్ష నగదు.. జ్ఞాపిక
ఉత్తమ ప్రజాసేవకుడిగా రేవంత్‌రెడ్డికి ఆర్యదాన్ మహమ్మద్ మెమోరియల్ అవార్డును అందించారు. అవార్డుతో పాటు రూ.1 లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు. కాగా, కేరళ వెలుపలి నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తి తానేనని సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
