* 15 మందికి తీవ్రమైన గాయాలు
* ఐదుగురి పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిన్న సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే.. నిజామాబాద్ జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 15 మందికి తీవ్రమైన గాయాలు అయ్యారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మల్లారం అటవీ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ని మండలం బడాపహాడ్ గ్రామానికి చెందిన 30 మంది డీసీఎంలో వెళ్తుండగా కొత్తకోట శివారులో వారి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
———————————–