SIIMA 2026
* తేజ సజ్జ, ఐశ్వర్య రాజేష్‌కు అవార్డులు
* రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి పురస్కారం
ఆకేరు న్యూస్, బెంగళూరు: దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)–2026 వేడుకలు బెంగళూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 12న జరిగిన తొలి రోజు వేడుకల్లో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశారు. 14వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ వేడుకలు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
తెలుగు విభాగంలో ‘మిరాయ్’ చిత్రంలో నటనకు తేజ సజ్జ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఐశ్వర్య రాజేష్ ఉత్తమ నటిగా నిలిచారు. విమర్శకుల విభాగంలోనూ ఆమె ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. ‘గోదారి గట్టు’ పాటకు రమణ గోగుల ఉత్తమ నేపథ్య గాయకుడిగా, ‘ప్రేమలో’ పాటకు సమీరా భరద్వాజ్ ఉత్తమ నేపథ్య గాయనిగా ఎంపికయ్యారు.
తెలుగు విభాగంలో మరికొందరు విజేతలు కూడా అవార్డులు అందుకున్నారు. ‘కోర్ట్’ చిత్రానికి పూర్ణా చారి ఉత్తమ గేయ రచయితగా, శ్రీదేవి ఉత్తమ నూతన నటిగా, హర్ష్ రోషన్ ఉత్తమ నూతన నటుడిగా నిలిచారు. ‘కింగ్డమ్’ చిత్రానికి సత్యదేవ్ ఉత్తమ సహాయ నటుడిగా, ‘డాకు మహారాజ్’కు శ్రద్ధా శ్రీనాథ్ ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు. ‘మిరాయ్’ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు గెలుచుకున్నారు.
కన్నడ విభాగంలో ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ‘సు ఫ్రమ్ సో’ చిత్రానికి జె.పీ. తుమినాడ్ ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నూతన దర్శకుడిగా రెండు పురస్కారాలు గెలుచుకున్నారు. ‘గత వైభవ’ చిత్రానికి ఎస్.ఎస్. దుష్యంత్ ఉత్తమ నూతన నటుడి అవార్డు అందుకున్నారు.
రెడ్ కార్పెట్‌పై సినీ తారల సందడి, సంగీత, నృత్య ప్రదర్శనలతో సైమా వేడుకలు కళకళలాడాయి. రెండో రోజు తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రదానం చేయనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
