KTR Police Convoy Stopped
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోగా, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కోమల్ల టోల్గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పర్యటనకు కేటీఆర్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు కోమల టోల్గేట్ వద్ద భారీగా మోహరించారు.

కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు, పర్యటనను భగ్నం చేసేందుకు పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. టోల్గేట్ పరిసర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను తీవ్రం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
మరోవైపు, కేటీఆర్ పర్యటనను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ విధమైన ఆంక్షలు విధిస్తోందని, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేటీఆర్ పర్యటన కొనసాగి తీరుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
* స్టేషన్ ఘన్ పూర్..
నియోజకవర్గ కేంద్రం స్టేషన్ ఘన్ పూర్ లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాజయ్య తో పాటు నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కేటీఆర్ కు పుష్పగుచ్చం అందించి విశాలతో సత్కరించారు.

* పలువురి అరెస్టు..
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు మండల నాయకులు మాచర్ల గణేష్, కనకం గణేష్, గుర్రం ఏసుబాబు, గుండా మల్లేష్, గుర్రం శ్రీనివాస్, కుంభం కుమార్ లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
