Naskal School English Teacher Suspension Protest
* స్కూల్ ముందు గ్రామస్తుల నిరసన
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
విధుల పట్ల, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఈ ‘టీచర్’ మాకొద్దు అంటున్నారు నష్కల్ గ్రామస్తులు. 2026 – 27 విద్యా సంవత్సరం ప్రారంభం మొదటి రోజు సోమవారం ఇంగ్లీష్ టీచర్ పోలీసుల సమక్షంలోనే గ్రామస్తులపై దాడికి యత్నించింది. షాక్ కు గురైన గ్రామస్తులు ఈ టీచర్ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
* వివరాల్లోకి వెళితే..
జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ హైస్కూల్ లో జ్యోతిలక్ష్మి ఇంగ్లీష్ టీచర్ గా గత కొంతకాలంగా పనిచేస్తుంది. ఇంగ్లీష్ టీచర్ గా తన విధులు సక్రమంగా నిర్వహించక విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, కిందిస్థాయి సిబ్బందితో అనవసర విషయాలను ముందు పెట్టి వారితో వాగ్వివాదానికి దిగిన సంఘటనలు గత ఏడాది జరిగినట్టు ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెలిపారు.
ఈ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు జనగణన చేసే క్రమంలో నష్కల్ గ్రామానికి చెందిన ఒక ఇంటికి వెళ్లి అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్న క్రమంలో మీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా ? వీళ్ళు మీ తల్లిదండ్రులే కారు అంటూ అనవసరపు విషయాన్ని ఆ విద్యార్థిని ప్రశ్నించింది. దీంతో ఆ విద్యార్థిని గత నాలుగైదు రోజులుగా నిద్రాహారాలు మాని నేనెవరో చెప్పాలని తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంది.
విషయం తెలిసిన గ్రామస్తులు జనగణనకు వెళ్లిన ఇంగ్లీష్ టీచర్ జ్యోతి లక్ష్మిని పాఠశాల పున ప్రారంభం రోజు అడిగేందుకు పాఠశాలకు వెళ్లారు. అదే సమయంలో ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు సర్పంచ్, వార్డు సభ్యులను హెచ్ఎం ఆహ్వానించింది. ఈ క్రమంలో సర్పంచ్, గ్రామస్తుల సమక్షంలో ఇంగ్లీష్ టీచర్ ను ఆమె తీరును ప్రశ్నించడంతో ఆవేశానికి గురైన టీచర్ పుస్తకాలను గ్రామస్తుల పైకి విసిరి వేయడం, గ్రామస్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నవ్వడం, హెచ్ఎం సీట్లో కూర్చుని నేనే హెచ్ఎం అని నాకెవరు ఎదురు చెప్పకూడదని వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. పోలీసులు వచ్చిన నచ్చజెప్పి ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులు అంత పాఠశాల ముందు నిరసనకు దిగారు. ఈ టీచర్ మాకొద్దు అంటూ ఎంఈఓ, డీఈఓ లకు ఫిర్యాదు చేశారు.
* టీచర్ ను సస్పెండ్ చేయండి ..
శాత బోయిన రాజు, సర్పంచ్
విద్యార్థుల పట్ల, విధుల పట్ల, తోటి సిబ్బంది పట్ల అనుచితంగా, అమర్యాదగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న ఇంగ్లీష్ టీచర్ జ్యోతిలక్ష్మి వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ సర్పంచ్ శాతబోయిన రాజు అధికారులను కోరారు. మా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఆమెతో ఎదుర్కొన్న సంఘటనలు మరో పాఠశాలలో చోటు చేసుకోకుండా ఉండేందుకు తక్షణం సస్పెండ్ చేయాలని కోరారు.
* హామీ ఇచ్చిన విద్యాధికారులు..
పాఠశాలలో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇంగ్లీష్ టీచర్ జ్యోతిలక్ష్మి ని విధులకు హాజరుకాకుండా ఉండడంతో పాటు మరో పాఠశాలకు వెళ్లకుండా అధికారులు ఆదేశాలు జారీ చేసేందుకు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు చేశారు.
