Amaravati Capital City Development
* అమరావతి నిర్మాణం.. వేగవంతం
* 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు
* 97 పనులు ప్రారంభం
* 4 ప్రాజెక్టులు పూర్తి
ఆకేరు న్యూస్, అమరావతి : రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. నాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శంకుస్థాపన కూడా చేయించారు. అయితే తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం రాజధానిపై దోచూచులాడింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. అయితే మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణంపై దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసింది. ఇక అక్కడి నుంచి నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రగతిపై ఆకేరు న్యూస్.. ప్రత్యేక కథనం..
* కీలక ముందడుగు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.12,731.13 కోట్లు ఖర్చు చేసింది. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక మైలురాయిగా నిలిచే E-3 సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు నూతనంగా నిర్మించిన ఐకానిక్ స్టీల్ బ్రిడ్జిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని బకింగ్‌హామ్ కెనాల్, కొండవీటి వాగులపై నాలుగు వరుసల మోడ్రన్ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ-మంగళగిరి జాతీయ రహదారికి రాజధాని అమరావతిని నేరుగా అనుసంధానిస్తుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవునా సీడ్ యాక్సెస్ రోడ్డు ను నిర్మించారు. అమరావతికి వచ్చే ప్రయాణికులకు సులువైన కనెక్టివిటీ లభించడంతో పాటు ఇన్నాళ్లూ రద్దీగా ఉండే కరకట్ట రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో ఇది “ప్రైమరీ గేట్‌వే”గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
* 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు
అమరావతి క్యాపిటల్ సిటీలో ఇప్పటివరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రతిపాదించామని మంత్రి నారాయణ తాజాగా ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. వీటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటిలో 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 93 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం అనంతరం వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అసెంబ్లీలో కీలక వివరాలను వెల్లడించారు. శాసనసభ్యులు శ్రావణ్‌కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
* ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు
వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్ తదితర సంస్థల ద్వారా అమరావతి నిర్మాణికి ప్రభుత్వం నిధులు సమీకరిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం రూ.41,187.70 కోట్ల రుణం సమకూర్చుకున్నామని అసెంబ్లీలో మంత్రి తెలిపారు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అమరావతిలో చేపడుతున్న మొత్తం 119 పనులకు సుమారు రూ.66,802 కోట్ల వ్యయం అవుతుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న 103 పనులకు రూ.58,093 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను నిలిపివేయడం వల్ల నిర్మాణ వ్యయం దాదాపు 25 శాతం పెరిగిందని మంత్రి వివరించారు.
* రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మొదటి నుంచీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సమీకరించిన భూమికి సంబంధించి 98 శాతం మేర రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించింది. ఇప్పటికే కేటాయింపు పూర్తయిందని మంత్రి నారాయణ తాజాగా వెల్లడించారు. మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించడం పూర్తయిందని, ప్రస్తుతం వాటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రైతులకు రూ.2,248.02 కోట్ల మేర కౌలు చెల్లించామని మంత్రి వెల్లడించారు.
* రూ.904 కోట్లతో మౌలిక వసతులు
అమరావతిలోని 29 రాజధాని గ్రామాలను క్యాపిటల్ సిటీలోని ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు రూ.904 కోట్లతో 29 గ్రామాల్లో రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించనున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను రాజధాని నగర ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లను ఆగస్టు 27న ఖరారు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులను వేగంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
* ఆర్అండ్బీ రోడ్ల పనులు వేగవంతం
రాజధాని గ్రామాల్లో ఆర్అండ్బీ పరిధిలోని కొన్ని రోడ్ల పనులు కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంశంపై ఆర్అండ్బీ శాఖ మంత్రి, సంబంధిత అధికారులతో చర్చించినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగవంతం చేశామని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
