Tamilnadu BJP Crisis Annamalai
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడులో భారతీయ జనతా పార్టీ (BJP)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే.. మరో కీలక నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా కాషాయ జెండాను వీడనున్నట్లు తెలుస్తోంది.
* అన్నామలై కొత్త పంథా వైపే మొగ్గు
ఇటీవలే అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి, ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా కరు నాగరాజన్ నిలిచారు. అన్నామలై తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆయనతో కలిసి నడిచేందుకే కరు నాగరాజన్ బీజేపీకి రాజీనామా చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంతో తమిళనాడు బీజేపీలో అంతర్గత సంక్షోభం ఒక్కసారిగా ముదిరింది.
* కొనసాగుతున్న వలసల పర్వం..
అన్నామలై రాజీనామా కేవలం ఒక వ్యక్తి నిష్క్రమణతో ఆగలేదు. ఆయన వెనుకే రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ సహా పలువురు కీలక నేతలు, క్షేత్రస్థాయి నాయకులు వరుసగా పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. దీంతో తమిళనాట బీజేపీ శ్రేణులు తీవ్ర అయోమయంలో పడ్డాయి. అన్నామలై ప్రారంభించబోయే కొత్త రాజకీయ ప్రస్థానం వైపే మెజారిటీ నేతలు మొగ్గు చూపుతుండటంతో, తమిళనాడులో బీజేపీ ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది.
