Liquor Price Hike Telangana
* ఏ బ్రాండ్‌పై ఎంతంటే..?
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు చేదువార్త. త్వరలోనే మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలో మద్యం ధరలను సవరించాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ధరల పెంపుపై అధ్యయనం చేసిన జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధంగా ఉంది.
* 15% వరకు పెంపు…
త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక ప్రకారం, రాష్ట్రంలో మద్యం ధరలను 10 శాతం నుండి 15 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ పెంపు ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఈ నెల 15వ తేదీ నుంచే నూతన ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* బ్రాండ్ల వారీగా పెంపు వివరాలు…
ఎక్సైజ్ శాఖ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, బ్రాండ్ల కేటగిరీని బట్టి ధరల పెంపు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.
సాధారణ బ్రాండ్లు (Ordinary Brands): ఒక్కో ఫుల్ బాటిల్‌పై గరిష్టంగా రూ. 80 వరకు పెంపు.
ప్రీమియం బ్రాండ్లు (Premium Brands): ఒక్కో ఫుల్ బాటిల్‌పై గరిష్టంగా రూ. 90 దాకా పెంపు.
కాస్లీ బ్రాండ్లు (Costly/Luxury Brands): ఒక్కో ఫుల్ బాటిల్‌పై రూ. 120 లేదా అంతకంటే పైనే పెంపు ఉండే అవకాశం ఉంది.
* బీర్ల ధరలపై కీలక నిర్ణయం:
లిక్కర్ కంపెనీలు మద్యం ధరలతో పాటు బీర్ల ధరలను కూడా పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశాయి. అయితే, గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే బీర్ల ధరలను సవరించినందున, ఇంత తక్కువ వ్యవధిలో మళ్లీ ధరలు పెంచడం సాధ్యం కాదని జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ కమిటీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఫలితంగా, ఈసారి సాధారణ, ప్రీమియం బీర్ల ధరలలో ఎలాంటి మార్పు ఉండబోదని సమాచారం.
* ప్రభుత్వానికి రూ. 3,000 కోట్ల అదనపు ఆదాయం..
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2,620 వైన్ షాపులు నడుస్తున్నాయి. ఈ ధరల పెంపుదల వల్ల ప్రభుత్వ ఖజానాకు నెలకు అదనంగా రూ. 200 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకు రాబడి రానుంది. అంటే వార్షిక ప్రాతిపదికన ప్రభుత్వానికి రూ. 2,400 కోట్ల నుండి రూ. 3,000 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరనుంది.
* తుది నిర్ణయం అప్పుడే…
రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ ఛైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. ముడిసరుకుల ధరలు, పొరుగు రాష్ట్రాలలో మద్యం ధరల వ్యూహాలను పరిశీలించి ఈ నివేదికను రూపొందించింది.
త్వరలోనే ఈ కమిటీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులతో తుది సమావేశాన్ని నిర్వహించి, ధరల పెంపుకు సంబంధించిన అధికారిక ఫైల్‌ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపనుంది. ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. అయితే, ఖచ్చితమైన అమలు తేదీపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అసోసియేషన్లతో మరో రౌండ్ సమావేశం ముగిశాకే స్పష్టత రానుంది.
