Cauvery water Dispute, Tamilnadu & Karnataka.. AI generated image
* సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ కోరిన తమిళనాడు
* కర్ణాటక నుంచి రావాల్సిన నీరు అందడం లేదని ఆరోపణ
* రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వెల్లడి
* ఆగస్టు 13న విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
ఆకేరు న్యూస్, చెన్నై :
కావేరీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటకతో కొనసాగుతున్న వివాదంపై అత్యవసర విచారణ చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, రాష్ట్రానికి రావాల్సిన పరిమాణంలో కావేరీ జలాలు అందడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. నీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో తమిళనాడు దరఖాస్తును ఆగస్టు 13న విచారణకు లిస్ట్ చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు.
* జూలై 30న సీడబ్ల్యుఎం ఏ ఏం చెప్పింది..?
కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) జూలై 30న ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కర్ణాటకలోని కబిని, కృష్ణరాజసాగర్ (KRS) జలాశయాల నుంచి రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజులపాటు నీటిని విడుదల చేయాలని CWMA ఆదేశించింది.ఈ లెక్కన ఆగస్టు 12 నాటికి తమకు 4.536 TMCల నీరు అందాలని తమిళనాడు కోరుతోంది. 4.536 TMCలు తమిళనాడు సరిపోవంటున్నది.
అయితే 4.536 TMCల నీటిని విడుదల చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని తమిళనాడు వాదిస్తోంది. ఇప్పటికే పేరుకుపోయిన నీటి లోటును కూడా కర్ణాటక భర్తీ చేయాలని కోరుతోంది.నీటి కొరత ఉన్న సంవత్సరాల్లో కావేరీ జలాల పంపిణీకి అనుసరించే సూత్రం ప్రకారం జూన్ 1 నుంచి ఆగస్టు 12 వరకు తమిళనాడుకు 26.954 TMCల నీరు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన దరఖాస్తులో పేర్కొంది.
* 3,500 క్యూసెక్కులు విడుదల చేయడం లేదు
సీడబ్ల్యు ఎం ఏ ( CWMA) ఆదేశించిన తర్వాత కూడా కర్ణాటక రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయలేదని తమిళనాడు ఆరోపించింది.కావేరీ జలాలు కర్ణాటక నుంచి తమిళనాడులోకి ప్రవేశించే బిలిగుండ్లు వద్ద నమోదైన ప్రవాహాన్ని ఇందుకు ఆధారంగా చూపింది. తమిళనాడు దరఖాస్తు ప్రకారం, జూలై 29 నుంచి ఆగస్టు 2 మధ్య బిలిగుండ్లు వద్ద నీటి ప్రవాహం కేవలం 158 నుంచి 530 క్యూసెక్కుల మధ్యే నమోదైంది.
* కర్ణాటక జలాశయాల్లో నీరుందని వాదన
సీడబ్ల్యు ఎం ఏ ( CWMA) ఆదేశాలను అమలు చేసేందుకు కర్ణాటక జలాశయాల్లో తగినంత నీరు అందుబాటులో ఉందని కూడా తమిళనాడు వాదిస్తోంది.ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ ఎస్ ( KRS ) కబిని, హారంగి, హేమావతి జలాశయాల్లో కలిపి 77.537 TMCల నీటి నిల్వలు ఉన్నాయని తమిళనాడు పేర్కొంది. అందువల్ల నీటి లభ్యత లేక విడుదల చేయలేని పరిస్థితి కర్ణాటకకు లేదన్నది తమిళనాడు వాదన.
* రెండు రాష్ట్రాలకు కావేరీ జీవనాధారం
కావేరీ నది కర్ణాటకలో పుట్టి తమిళనాడులోకి ప్రవహిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రెండు రాష్ట్రాలు కావేరీ జలాలపై భారీగా ఆధారపడి ఉన్నాయి.అందుకే వర్షాభావం లేదా నీటి లభ్యత తగ్గిన ప్రతిసారీ జలాల పంపిణీ రెండు రాష్ట్రాల మధ్య అత్యంత సున్నితమైన అంశంగా మారుతోంది.
ప్రస్తుతం తమిళనాడు 4.536 TMCల నీటిని తక్షణమే విడుదల చేయించాలని మాత్రమే కాకుండా, ఇప్పటికే పేరుకుపోయిన నీటి లోటును కూడా భర్తీ చేయించాలని సుప్రీంకోర్టును కోరుతోంది.
అదేవిధంగా కర్ణాటక జలాశయాల్లోని నీటి నిల్వలు, అక్కడి నుంచి విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని ప్రతి 10 రోజులకు ఒకసారి CWMA పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరింది. దీంతో కావేరీ వివాదంలో ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 13న సుప్రీంకోర్టులో జరిగే విచారణపై కేంద్రీకృతమైంది.
—————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
