Bhatti Vikramarka, Telangana Employee Insurance
* తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉచిత ప్రమాద భీమా పథకాన్ని అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభ వేదికగా వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 12,91,046 మంది సిబ్బందికి నేరుగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
* ఒక్క రూపాయి భారం ఉండదు..
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రధాన బ్యాంకులతో ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఉద్యోగుల జీతాల ఖాతాలు ఈ బ్యాంకుల్లోనే ఉన్నందున, ప్రభుత్వంపైనా లేదా ఉద్యోగులపైనా ఒక్క రూపాయి కూడా ప్రీమియం భారం పడకుండా బ్యాంకుల ద్వారానే ఈ ఉచిత భీమా సౌకర్యం లభించేలా చూశామన్నారు. ఇది మానవీయ కోణంలో తీసుకున్న గొప్ప నిర్ణయమని స్పష్టం చేశారు.
* గతంలో రూ. 5 లక్షలు మాత్రమే..
గతంలో ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే కేవలం రూ. 5 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చేవారని, కానీ తమ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగి కుటుంబానికి పూర్తి భద్రత ఉండాలనే ఆలోచనతో ఈ మొత్తాన్ని రూ. 1 కోటి నుండి రూ. 1.20 కోట్ల వరకు పెంచినట్లు తెలిపారు. ఉద్యోగులు విమాన ప్రయాణంలో ప్రమాదానికి గురై మరణిస్తే రూ. 2 కోట్ల వరకు కవరేజ్ లభిస్తుంది. సాధారణ లేదా సహజ మరణాలకు కూడా రూ. 10 లక్షల వరకు లబ్ధి చేకూరేలా నిబంధనలు రూపొందించారు.
* దశలవారీగా పథకం విస్తరణ..
ఈ ఉచిత భీమా పథకాన్ని ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తూ వచ్చింది. ముందుగా సింగరేణి సంస్థ (SCCL) ఉద్యోగులకు ప్రవేశపెట్టారు. 2025 : ఎనర్జీ శాఖ పరిధిలోని విద్యుత్ డిస్కంల (DISCOM) ఉద్యోగులకు వర్తింపజేశారు. జూన్ 25, 2026 జీవో నెంబర్ 77 (G.O. Ms. No.77) ద్వారా రాష్ట్రంలో ఉన్న రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో విస్తరించారు.
* వేగంగా క్లెయిమ్‌ల పరిష్కారం..
ఇప్పటివరకు అందిన క్లెయిమ్‌లను ప్రభుత్వం అత్యంత వేగంగా సెటిల్ చేసి బాధితుల కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. 50 క్లెయిమ్‌లకు గాను 50 క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి.
విద్యుత్ శాఖ: 15 క్లెయిమ్‌లకు గాను 15 క్లెయిమ్‌లు సెటిల్ చేసి బాధితులకు చెక్కులు అందించారు.
*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు..
అందిన 33 క్లెయిమ్‌లలో 24 క్లెయిమ్‌లను ఇప్పటికే పరిష్కరించి రూ. 1 కోటి చొప్పున పరిహారం అందించడం జరిగింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలనే ఆలోచనతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ పథకాన్ని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క తెలియజేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
