G Vivek Venkataswamy Telangana Minimum Wages
* వేతనాల పెంపుపై మంత్రి వివేక్ కీలక ప్రకటన
* జీవో నెం. 6 విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని అసంఘటిత, పారిశ్రామిక రంగ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కార్మిక లోకానికి సాంత్వన చేకూరుస్తూ కనీస వేతనాల పెంపును ఖరారు చేసినట్లు ఆయన సభకు వెల్లడించారు.
* కనీస వేతనాల జీవో వివరాలు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, సంస్థలలో సుమారు 1.10 కోట్లకు పైగా అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తున్నారు. గత 10-12 సంవత్సరాలుగా ఆనాటి టిఆర్ఎస్/బిఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనాల పునఃసమీక్షను పూర్తిగా పక్కనబెట్టిందని, వేతనాల పెంపుపై ఏనాడూ ఆలోచన కూడా చేయలేదని మంత్రి విమర్శించారు. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా 30 మే 2026న G.O. MS No. 6ను జారీ చేశామని, పెంచిన కనీస వేతనాలు 1 జూన్ 2026 నుండి అమల్లోకి వచ్చాయని ఆయన అధికారికంగా తెలిపారు.
* భట్టి నేతృత్వంలో క్యాబినెట్ సబ్-కమిటీ…
ప్రజా ప్రభుత్వం అధికారం లోకి రాగానే కార్మికులకు న్యాయం చేయడానికి ప్రత్యేక క్యాబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు కార్మిక శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి సభ్యులుగా వ్యవహరించి, లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
* ఒత్తిళ్లను అధిగమించి చారిత్రక నిర్ణయం..
వేతనాల పెంపు నిర్ణయ సమయంలో సిఐఐ (CII), ఫాప్సీ (FAPCCI) వంటి పారిశ్రామిక వర్గాల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చిందని మంత్రి వివరించారు. వేతనాలు పెంచితే పరిశ్రమల నిర్వహణ భారం అవుతుందని వారు పేర్కొన్నప్పటికీ, కార్మికుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం వారికి నచ్చజెప్పి ముందుకు సాగిందని చెప్పారు.
* ‘కాకా’ స్పూర్తితో..
ఈ సందర్భంగా తన తండ్రి, అమరజీవి “కాకా” వెంకట్ స్వామి కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న నాటి జ్ఞాపకాలను వివేక్ గుర్తు చేసుకున్నారు. నాడు ప్రైవేట్ రంగంలో కార్మికులకు పెన్షన్ స్కీమ్ (PF Pension) ప్రవేశపెట్టేటప్పుడు కూడా యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అయినా “ఇది పేద కార్మికుల పట్ల మనం నెరవేర్చాల్సిన బాధ్యత” అని కాకా గారు నిలబడ్డారని చెప్పారు. అదే స్ఫూర్తితోనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఒప్పించి లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా వేతనాల పెంపును ఖరారు చేసిందని మంత్రి గర్వంగా ప్రకటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
