warangal high alert
* కరీంనగర్ దోపిడీ ముఠా వరంగల్ వైపు..
* బస్సు, రైల్వే స్టేషన్లలో పోలీసుల హైఅలర్ట్
ఆకేరు న్యూస్, వరంగల్: కరీంనగర్లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర దోపిడీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు కీలక సమాచారం లభించింది. దోపిడీ అనంతరం దుండగులు తాము దొంగిలించిన రెండు ద్విచక్ర వాహనాలపై వరంగల్ వైపు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
* వరంగల్‌లో హైఅలర్ట్.. అణువణువూ తనిఖీలు
నిందితులు వరంగల్ వైపు వచ్చారనే పక్కా సమాచారంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నిందితులు నగర సరిహద్దులు దాటి రైళ్లలో లేదా బస్సుల్లో వేరే ప్రాంతాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్, ఖాజీపేట రైల్వే స్టేషన్లతో పాటు ఆర్టీసీ బస్టాండ్లు, ప్రధాన రవాణా కూడళ్ల వద్ద పోలీసులు విస్త్రతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
* సీసీటీవీ విజువల్స్ విడుదల…
అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు గాను దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలను పోలీసులు మీడియాకు, సోషల్ మీడియాకు విడుదల చేశారు. ప్రజలు ఎవరైనా ఈ దృశ్యాల్లో ఉన్న వారిని లేదా అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా అత్యవసర నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
