Minister Thummala Nageswara Rao Telangana Vegetable Subsidy
* బిగ్ ఆఫర్ ఇచ్చిన సర్కార్
* కూరగాయల సాగుకు భారీ ప్రోత్సాహం
* 90శాతం సబ్సిడీ, రూ. 125కోట్ల నిధుల కేటాయింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచి, ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. శాసనసభ వేదికగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూరగాయల సాగు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు రాబోయే రోజుల్లో చేయనున్న నిధుల కేటాయింపులపై స్పష్టమైన ప్రకటన చేశారు.
* అదనంగా 21,583 ఎకరాల్లో సాగు..
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సాధారణ కూరగాయల సాగు విస్తీర్ణం 51,000 ఎకరాలు ఉండగా, ప్రభుత్వ సమర్థవంతమైన ప్రోత్సాహం వల్ల అది ఏకంగా 72వేల 583 ఎకరాలకు పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అదనంగా 21వేల 583 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. 2014 సంవత్సరం నుంచి గత ఏడాది వరకు ఏటా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చిందని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారి మళ్ళీ సాగు పుంజుకుందని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.
* 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి
ప్రస్తుత డిమాండ్ ప్రకారం చూస్తే 2025-26లో ఇతర రాష్ట్రాల నుండి దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని మంత్రి వెల్లడించారు. మార్కెట్లో కూరగాయల ధరలు నిత్యం డిమాండ్ మరియు సప్లయ్ సూత్రం ఆధారంగానే మారుతుంటాయని, అందుకే స్థానికంగా ఉత్పత్తి పెంచితే ధరల హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులకు, రైతులకు ఉపశమనం లభిస్తుందని వివరించారు.
* రైతులకు భారీ సబ్సిడీ…
రైతులను ఉద్యానవన పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం 40శాతం నుంచి 90శాతం వరకు భారీ సబ్సిడీని అందిస్తోందని స్పష్టం చేశారు. ఈ సబ్సిడీని క్రింది విభాగాలుగా అందిస్తున్నారు. నాణ్యమైన నారు మరియు మల్చింగ్, షేడ్‌నెట్ నిర్మించుకోవడం, శాశ్వత పందిళ్ల ఏర్పాటు, బిందు మరియు తుంపర సేద్యం (డ్రిప్ & స్ప్రింక్లర్ ఇరిగేషన్) కోసం ప్రత్యేక నిధులు ప్రకటించారు. కూరగాయల సాగును మరింత ప్రోత్సహించేందుకు 2026-27 బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తుమ్మల ప్రకటించారు..
* కేటాయింపుల వారీగా..
నారు, మల్చింగ్, షేడ్నెట్ల కోసం : ₹20 కోట్లు. శాశ్వత పందిళ్ల నిర్మాణానికి: ₹8 కోట్లు. బిందు/తుంపర సేద్య పరికరాల కోసం: ₹97 కోట్లు కేటాయించారు. దీంతో పాటు రైతులందరికీ వారి పొలం విస్తీర్ణం ప్రాతిపదికన ఎటువంటి వ్యత్యాసం లేకుండా ‘రైతు భరోసా’ పెట్టుబడి సహాయాన్ని తప్పకుండా అందిస్తామని మంత్రి సభకు హామీ ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
