* పరిష్కారమార్గాలు వెదుకుతున్న రెవెన్యూ యంత్రాంగం
* ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి
22A Lands| ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : తెలంగాణలో గత కొంతకాలంగా అత్యంత తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘సెక్షన్ 22ఏ’ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ చట్టం, అధికారుల కొన్ని పొరపాట్ల కారణంగా నిరుపేదల ఇళ్లు, దశాబ్దాల నాటి ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది.
తహసీల్దార్లకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలోని తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రైవేట్ స్థలాలు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఏయే ప్రాంతాలు పొరపాటున నిషేధిత జాబితాలో చేరాయి? అనే వివరాలపై పూర్తి స్థాయి లెక్కలు తేల్చాలని తహసీల్దార్లను ఆమె ఆదేశించారు. అలాగే, సబ్ రిజిస్ట్రార్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ రోజువారీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఆరా తీస్తున్నారు. మునిసిపల్, హెచ్ ఎండీఏ అనుమతులున్న ఆస్తులు 22ఏలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అధికారులు చేపడుతున్న చర్యలను తెలుసుకుంటున్నారు.
అధికారుల తప్పిదాలతోనే మొదలైన ఇబ్బందులు
రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 22ఏ సెక్షన్ ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన భూసవరణ ప్రక్రియలో భాగంగా.. అసైన్డ్ (22ఏ), స్టేట్ అండ్ సెంట్రల్ (22బీ), దేవాదాయ/వక్ఫ్ బోర్డు (22సీ), అగ్రికల్చర్/అర్బన్ ల్యాండ్ సీలింగ్ (22డీ), కోర్టు కేసులున్న భూముల (22ఈ) పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా భూములు సైతం అనుకోకుండా నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. కొన్ని చోట్ల అధికారుల పర్యవేక్షణ లోపం, మరికొచోట క్షేత్రస్థాయిలో సరైన రికార్డులు అప్డేట్ చేయకపోవడం వల్ల సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
మాజీ సీఎం నుంచి అతి సామాన్యుల వరకు..
హైదరాబాద్ జిల్లాలో సుమారు 3,288.16 ఎకరాల అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూములు ఉండగా, మరోవైపు వేలాది ఎకరాల దేవాదాయ, వక్ఫ్ భూములు ఉన్నాయి. అయితే విచిత్రమేమిటంటే, అత్యంత ప్రతిష్టాత్మకమైన బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ మొత్తం కూడా 22ఏ ప్రోహిబిటెడ్ లిస్టులో ఉన్నట్లు తేలింది. ఇందులో ఓ మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఉండడం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లోనే ఇలా ఉంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.
సమగ్ర నివేదికకు హడావుడి
జిల్లాలో సుమారు 12 లక్షలకు పైగా భూములు వివిధ దశల్లో కోర్టు కేసుల్లో నానుతున్నాయి. ఏళ్ల తరబడి ఇవి పెండింగ్‌లో ఉండగా, కౌంటర్లు దాఖలు చేయడంలో కొందరు అధికారులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఆక్రమణలకు దారితీస్తోందనే ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో కోర్టు కేసులున్న భూములు, వాటి ప్రస్తుత పరిస్థితిపై మండలాల వారీగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవల కలెక్టర్ ఆదేశించడంతో రెవెన్యూ సిబ్బంది పరుగులు పెడుతున్నారు. రికార్డులు సరిగ్గా లేని చోట అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రజలకు ఊరటనిచ్చే దిశగా అడుగులు
ప్రజలను మరింత కాలం ఇబ్బందులకు గురిచేయకుండా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. సరిగ్గా ఉన్న పట్టా భూములకు ‘బై నంబర్లు’ కేటాయించి పరిష్కారానికి పూనుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ తాజా ప్రక్షాళన చర్యలతో త్వరలోనే 22ఏ బాధిత ఆస్తుల యజమానులకు ఊరట లభిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
