Telangana Mega Infrastructure Projects
* జూలైలోనే 10 హామ్ (HAM) రోడ్ల పనులకు శ్రీకారం
* డిసెంబర్ 2027 నాటికి కొత్త హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రారంభం
* వర్షాకాలం తర్వాత మూడు షిఫ్టుల్లో రోడ్డు పనులు
* బాసర, భద్రాచలం ఆలయ పనులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష
-సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశాలు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ స్థాయి రోడ్డు, మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు – భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అత్యంత నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
* జూలైలో మరో 10 ప్యాకేజీల పనులు ప్రారంభం
మొదటి విడత హామ్ (HAM) రోడ్డు కార్యక్రమంలో భాగంగా దాదాపు ₹13,000 కోట్ల అంచనా వ్యయంతో 34 ప్యాకేజీల కింద 6,092 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్యాకేజీ-2 కింద 42 కిలోమీటర్ల నల్గొండ–మహబూబ్నగర్ డబుల్ రోడ్డు పనులు ప్రారంభం కాగా, జూలై నెలలోనే మరో 10 ప్యాకేజీల పనులను ప్రారంభం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ముగిసిన వెంటనే రాత్రి వేళలతో కలిపి మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. నాణ్యమైన రోడ్డు కనెక్టివిటీ వల్ల ఆర్థిక వృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అందుకే ప్రతి ప్యాకేజీకి అనుభవజ్ఞులైన ఫీల్డ్ ఇంజనీర్లను నియమించి పనులను నిరంతరం పర్యవేక్షించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. జూలై 6న కరీంనగర్ జిల్లాలో హామ్, సీఆర్ఎఫ్ రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
* డిసెంబర్ 2027 నాటికి సిద్ధం
రాజేంద్రనగర్లో నిర్మిస్తున్న కొత్త హైకోర్టు కాంప్లెక్స్, జడ్జీల నివాస గృహాల నిర్మాణ పనుల వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. కొత్త హైకోర్టు భవన సముదాయంతో పాటు కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనాన్ని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని గడువు విధించారు. అలాగే సనత్నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లలో టిమ్స్ (TIMS) ఆసుపత్రులు, నిమ్స్ (NIMS) విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
* ఆలయాల అభివృద్ధి, పుష్కరాల ఏర్పాట్లు
బాసర, భద్రాచలం దేవాలయాల అభివృద్ధి పనుల ప్రగతితో పాటు రానున్న గోదావరి పుష్కరాల కోసం ఆర్అండ్బీ శాఖ చేపడుతున్న ఏర్పాట్లను కూడా మంత్రి సమీక్షించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సాంకేతికంగా సమర్థులైన, నిబద్ధత గల ఇంజనీర్లను నియమించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ వారం నుంచే ప్రాజెక్టుల సైట్లలో తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, పనుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేదా ఆలస్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమీక్షా సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే శ్రీ మనోహర్ రెడ్డి, ఇంజనీర్-ఇన్-చీఫ్ శ్రీమతి జయభారతి, చీఫ్ ఇంజనీర్లు బి.వి.రావు, రాజేశ్వర్ రెడ్డి, ధర్మా రెడ్డి, వసంత్ నాయక్, వనజ, రాజేందర్, నర్సింగ్ రావు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
