Deputy CM Bhatti Telangana EHS Scheme
* 13 లక్షల మందికి ఉచిత వైద్యం
* అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
* ఉద్యోగుల హెల్త్ కార్డుకు ఇతర రాష్ట్రాల ప్రశంసలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వేదికగా రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ సిబ్బంది కోసం ప్రవేశపెట్టిన ‘ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (EHS) ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ పథకం దేశంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.
* కేంద్రం సైతం అధ్యయనం..
ఈ తరహా సమగ్ర నగదు రహిత (Cashless) ఆరోగ్య భద్రతా పథకం భారతదేశంలో ఎక్కడా లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. మొదటగా సింగరేణి సంస్థలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన అనుభవంతో, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ విస్తరించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం అధ్యయనం చేసి, దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలు కూడా ఈ మోడల్‌ను అధ్యయనం చేసి తమ వద్ద అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు.
* దాదాపు 13 లక్షల మందికి లబ్ధి..
ఈ రోగనిరోధక, చికిత్సా భద్రతా పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది (12,91,046 మంది) లబ్ధి పొందుతున్నారని భట్టి విక్రమార్క అసెంబ్లీకి లెక్కలతో సహా వివరించారు. రెగ్యులర్ ఉద్యోగులు 5,18,273 మంది, టెంపరరీ & కాంట్రాక్ట్ సిబ్బంది అవుట్సోర్సింగ్, మల్టీపర్పస్ వర్కర్లు, కాంట్రాక్ట్, డైలీ వేజ్, NMR, MTS, సెర్ప్ (SERP) స్టాఫ్, ఆనరరీ ఉద్యోగులు అందరూ కలిపి 5,00,158 మంది.
పెన్షనర్లు : సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, దివ్యాంగులైన పిల్లలు, వితంతువులు, దివ్యాంగ కుమార్తెలు కలిపి 2,72,615 మంది.
* దశాబ్దాల కల నెరవేర్చిన ప్రజా ప్రభుత్వం
గతంలో ఉద్యోగ సంఘాలు ఎన్నో ఏళ్లుగా పూర్తిస్థాయి క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల కోసం పోరాటం చేశాయని, గత ప్రభుత్వాల హయాంలో అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మానవీయ కోణంలో ఆలోచించి, ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్య సదుపాయం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికోసం సీఎస్ నేతృత్వంలో అధికారులతో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని వేసి, సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నూతన పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.
* రూ. 264 కోట్లతో కార్పస్ ఫండ్..
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) ప్యాకేజీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగులు మరియు ప్రభుత్వం సమాన భాగస్వామ్యంతో (Equal Contribution) ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ పథకం సజావుగా సాగేందుకు ప్రభుత్వం ఇప్పటికే ₹264 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయించింది. అంతేకాకుండా, ప్రతి నెలా ప్రభుత్వ అధికారులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన కమిటీ సమావేశమై పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహిస్తుందని, ఎలాంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
