HYDRAA Commissioner Fine
* జరిమానా కడితేనే కౌంటర్ స్వీకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, చెరువుల పరిరక్షణతో నిత్యం వార్తల్లో నిలిచే హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒక భూవివాదం కేసులో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. కమిషనర్ రంగనాథ్‌కు రూ.50 వేల భారీ జరిమానా విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ మండలం, యూసుఫ్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండు ఎకరాల భూమి వివాదంపై మహ్మద్ షఫాహతుల్లా అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలంలో గతంలోనే కోర్టు యథాతథస్థితి (స్టేటస్ కో) విధించింది. అయితే, కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ.. హైడ్రా అధికారులు అక్కడ జోక్యం చేసుకుని ప్రహరీ గోడను కూల్చివేశారని, అంతేకాకుండా అక్కడ కంచె వేసి హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఓపెన్ స్పేస్ అంటూ బోర్డులు పెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
* కోర్టు ఆగ్రహానికి కారణం ఇదే..
ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గతంలోనే హైడ్రాను ఆదేశించింది. ఇందుకోసం పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ హైడ్రా అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఇటీవల హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ కౌంటర్ సమర్పించామని చెప్పినప్పటికీ.. సాంకేతిక కారణాలతో రిజిస్ట్రీ దానిని తిరస్కరించిందని, రికార్డుల ప్రకారం ఒక్క కౌంటర్ కూడా దాఖలు కాలేదని తెలియడంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
* కోర్టు కీలక ఆదేశాలు..
“కోర్టు ఆదేశాలను అధికారులు సకాలంలో పాటించాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిని సహించేది లేదు” అని న్యాయస్థానం స్పష్టం చేసింది. విధించిన రూ.50 వేల జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) రిలీఫ్ ఫండ్ కు జమ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఈ జరిమానా సొమ్ము చెల్లించిన తర్వాతే హైడ్రా సమర్పించే కౌంటర్ అఫిడవిట్‌ను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 15కు వాయిదా వేసింది. అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడే హైడ్రాకు.. స్వయంగా హైకోర్టులోనే ఇలాంటి ఎదురుదెబ్బ తగలడం ఇప్పుడు అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
