Damodar Rajanarsimha
Damodar Rajanarsimha| ఆకేరు న్యూస్, హైదరాబాద్: రక్త నిల్వలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర వైద్యంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు.
అత్యవసర చికిత్సలకు రక్తం కీలకం
ప్రమాదాల్లో గాయపడినవారు, అత్యవసర ప్రసవ పరిస్థితుల్లో ఉన్న మహిళలు, తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులు, క్యాన్సర్ రోగులు, వివిధ శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి రక్తం అవసరం ఎక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో రక్తం కోసం రోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ముందుగానే తగిన నిల్వలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వస్తే అత్యవసర సమయాల్లో రక్తం కోసం ఎదురయ్యే సమస్యలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
విస్తృతంగా శిబిరాలు
విద్యాసంస్థలు, యువజన సంఘాలు, పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచాలని మంత్రి సూచించారు. ఆయా సంస్థల ఆధ్వర్యంలో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అధికారులను కోరారు. మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఎంసీఆర్ టిమ్స్ బృందాలను మంత్రి అభినందించారు. శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
