Tuni Gnaneshwari Missing Case
ఆకేరు న్యూస్, డెస్క్: తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు ఇంకా వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. చిన్నారి ఇంటి నుండి అదృశ్యమై నేటికి 20 రోజులు గడుస్తున్నా.. ఆమె ఆచూకీ లభించకపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
* తల్లికి తీవ్ర అస్వస్థత..
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నకూతురు కళ్లముందే మాయమవడంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం బెంగ పెట్టుకున్న తల్లి భవాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కూతురు క్షేమంగా తిరిగి వస్తుందనే ఆశతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
* గాలింపు నిలిపివేసిన రెస్క్యూ టీమ్స్..
గడిచిన మూడు వారాలుగా జల్లెడ పట్టిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) మరియు అటవీ శాఖ సిబ్బంది.. చిన్నారి జాడ ఎక్కడా లభించకపోవడంతో ప్రస్తుతానికి తమ గాలింపు చర్యలను నిలిపివేశారు. స్థానిక పరిసరాలు, అడవి ప్రాంతాలు, జలవనరులను వెతికినా ఎలాంటి క్లూ దొరకలేదు.
* కిడ్నాప్ కోణంలో పోలీసుల దర్యాప్తు..
రెస్క్యూ టీమ్స్ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు తుని రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసును ‘కిడ్నాప్’ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technical Investigation) ఉపయోగించి, ఆ ప్రాంతంలోని మొబైల్ సిగ్నల్స్, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు.
* మిస్టరీగా మారిన పెంపుడు కుక్క మృతి..
ఈ కేసులో మరో కీలక మలుపు పెంపుడు కుక్క మరణం. చిన్నారి అదృశ్యమైన సమయంలోనే మరణించిన వీరి పెంపుడు కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. ఈ రిపోర్ట్ వస్తే కేసు దర్యాప్తుకు అత్యంత కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
* రంగంలోకి హైకోర్టు.. ప్రభుత్వానికి ఆదేశాలు..
చిన్నారి అదృశ్యం కేసుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) కూడా స్పందించింది. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చేస్తూ, పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని ఇటీవల రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
