Adani Power Plant Accident
* వరుస ప్రమాదాలతో కార్మికుల్లో భయం..భయం..
* మూడు రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు..
* ఒక కార్మికుడి మృతి, ఐదుగురికి గాయాలు
* రాయ్ఖేడా ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాల వైఫల్యం
* పరిహారం కాదు.. ప్రమాదాలకు బాధ్యులెవరో తేల్చాలంటున్న కార్మికులు
ఆకేరు న్యూస్ , రాయ్‌పూర్ ( చత్తీష్ గఢ్ ) :
ఒక ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. మూడు రోజులకే మరో ప్రమాదం ఒక యువ కార్మికుడి ప్రాణం తీసింది. ఛత్తీస్‌గఢ్‌లోని అదానీ పవర్ రాయ్ఖేడా థర్మల్ పవర్ ప్లాంట్‌లో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలు కార్మికుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.జాంజ్గీర్ చాంపా జిల్లాకు చెందిన 26 ఏళ్ల కేశవ్ కుమార్ మహిలాంగే శనివారం ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.అయితే అతడి మృతికి దారితీసిన ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. భారీ ఇనుప పైపు తగలడంతో మహిలాంగే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానిక సంఘాలు చెబుతున్నాయి. మరో కథనం ప్రకారం విధులు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో హైవా వాహనం ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు.ఈ రెండు వాదనల్లో ఏది వాస్తవమన్నది స్వతంత్ర విచారణలో తేలాల్సి ఉంది.
* కుటుంబ సభ్యుల ఆందోళన
మహిలాంగే మృతి అనంతరం అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఛత్తీస్‌గఢియా క్రాంతి సేనతో పాటు కార్మిక ప్రతినిధులు వారికి మద్దతుగా నిలిచారు.మృతుడి కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించడంతో సరిపెట్టకుండా, ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై నిష్పాక్షిక విచారణ జరపాలి. నిర్లక్ష్యానికి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
* మూడు రోజుల ముందే క్రేన్ కూలింది
ఈ ఘటనకు మూడు రోజుల ముందే, ఆగస్టు 5న ఇదే రాయ్ఖేడా ప్లాంట్‌లో మరో తీవ్రమైన ప్రమాదం జరిగినట్లు సమాచారం.ప్లాంట్‌లోని బాయిలర్ నిర్మాణ ప్రాంతంలో క్రేన్ కూలిపోవడంతో తీవ్ర కలకలం ఏర్పడింది. కార్మికులను అత్యవసరంగా అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అనంతరం బారికేడ్లతో మూసివేసి, రాకపోకలను నియంత్రించారు. సాంకేతిక బృందాలు నష్టాన్ని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
* మూడు రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు
ఈ రెండు ప్రమాదాలు వేర్వేరు ఘటనలే. కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే జరగడం వల్ల ప్లాంట్‌లో అమలవుతున్న భద్రతా వ్యవస్థపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్న ప్రాంగణంలో భద్రతా నిబంధనలు ఎంత కచ్చితంగా అమలవుతున్నాయి? భారీ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రిస్క్ అసెస్మెంట్ సక్రమంగా జరుగుతోందా? యంత్రాలు, క్రేన్లు, భారీ వాహనాల నిర్వహణపై తగిన పర్యవేక్షణ ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. రాయ్ఖేడా కాంప్లెక్స్‌లో అదానీ పవర్‌కు చెందిన 1,370 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. దీనికి అదనంగా తిల్దా బ్లాక్‌లోని రాయ్ఖేడా, గైతారా, చిచోలీ ప్రాంతాల్లో 2×800 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టు కూడా అభివృద్ధి దశలో ఉంది.
* ప్రమాదానికి కారణం ఏమిటి?
భద్రతా వ్యవస్థలో లోపం ఎక్కడ జరిగింది..? నిర్లక్ష్యం జరిగిందా..?
జరిగితే దానికి బాధ్యులెవరు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలని కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.రాయ్ఖేడా ప్లాంట్‌లో గతంలోనూ వేతనాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు, వృత్తిపరమైన భద్రత వంటి అంశాలపై కార్మికుల ఆందోళనలు జరిగిన నేపథ్యం ఉంది. తాజా ఘటనలు ఆ సమస్యలను మరోసారి ముందుకు తెచ్చాయి.
* ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది యాజమాన్యమే
మూడు రోజుల వ్యవధిలో ఒకే పారిశ్రామిక ప్రాంగణంలో రెండు తీవ్రమైన ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని విడివిడి ఘటనలుగా నమోదు చేయడం మాత్రమే సరిపోదు.క్రేన్ ఎందుకు కూలింది? మహిలాంగే మృతికి అసలు కారణమేమిటి? రెండు ఘటనల్లోనూ నిర్దేశిత భద్రతా ప్రమాణాలు పాటించారా? పర్యవేక్షణలో వైఫల్యం ఉందా? అన్న అంశాలను పారదర్శకంగా తేల్చాల్సి ఉంది.అంతిమంగా ప్రమాదం జరిగిన తర్వాత ఎంత పరిహారం ఇచ్చారన్నది మాత్రమే కాదు మరో కార్మికుడి ప్రాణం పోకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నదే అసలైన భద్రతకు కొలమానం అని కార్మికులు అంటున్నారు.
————————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
