Telangana Employees Teachers Issues
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ తీవ్రంగా విమర్శించారు. స్టేషన్ ఘన్ పూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఆదివారం ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పెచ్చెట్టి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మూడేళ్ళ సంది వేతన సవరణ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని అన్నారు. ఆరు విడతల కరువు భత్యం మంజూరు చేయకుండా ఉపేక్షిస్తోందని విమర్శించారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ తో ఈహెచ్ఎస్ అమలులో తాత్సారం చూపుతోందని..ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు చేయలేదని విమర్శించారు.. ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలు చేయడం ఎందుకు సాధ్యం కావడం లేదు ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులు స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు? ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఎడ్ కళాశాల లెక్చరర్లు, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయని వీటి భర్తీని డెప్యూటేషన్ లతో కాకుండా పదోన్నతులతో భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇంచార్జి కానుగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ త్వరగా అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు తాళ్లపెళ్లి హేమలత, జిల్లా కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు కందుల శ్రీనివాస్, మెంతుల శ్రీనివాస్, కటకం సుధీర్ రెడ్డి, తోట వెంకటేశ్వర్లు, కుటుంబ సంక్షేమ నిధి జిల్లా కన్వీనర్ గూడెల్లి కృష్ణ, బాలకృష్ణ, గుండె కనకయ్య, సైదులు, రంజిత్, పిట్టల మహేందర్, పన్నెండు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
