Urvashi Rautela
ఆకేరు న్యూస్, సినిమా: టెక్నాలజీ అభివృద్ధి ఎంతగా ఉపయోగపడుతోందో.. అంతే స్థాయిలో దుర్వినియోగం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సెలబ్రిటీల గుర్తింపును అనుమతి లేకుండా ఉపయోగిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి ఉర్వశీ రౌతేలా కూడా ఇలాంటి వ్యవహారంలో న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు సమాచారం. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ఏఐ కంపెనీ తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించిందని ఆమె బృందం ఆరోపించింది. ఈ వ్యవహారంలో నష్టపరిహారంగా సుమారు రూ.7,000 కోట్లను ఆమె కోరుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
‘నా అనుమతి లేకుండా వాడొద్దు’
ఉర్వశీ గుర్తింపును తమ వ్యాపారంలో అనధికారికంగా ఉపయోగించారని ఆమె బృందం పేర్కొంది. దీనిపై స్పందిస్తూ.. ‘‘మీ ఏఐ కంపెనీని నిర్మించుకోండి. మీ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోండి. కానీ ఉర్వశీ పేరు, గుర్తింపును ఆమె అనుమతి లేకుండా మీ వ్యాపారంలో ఉపయోగించవద్దు’’ అని స్పష్టం చేసింది. పేరు, ఫొటోలు, వీడియోలు వంటి వ్యక్తిగత గుర్తింపు అంశాలను వాణిజ్యపరంగా వినియోగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది.
పెరుగుతున్న సెలబ్రిటీల న్యాయపోరాటం
సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) దుర్వినియోగం కాకుండా కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ తదితరులు కూడా తమ పేరు, రూపం, గుర్తింపును అనుమతి లేకుండా ఉపయోగించకుండా న్యాయపరమైన రక్షణ కోరిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉర్వశీ రౌతేలా చేపట్టినట్లు చెబుతున్న న్యాయపోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
