Vijayawada
* సచివాలయ ఉద్యోగుల అరెస్టులు
ఆకేరు న్యూస్, విజయవాడ: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టేందుకు ఉద్యోగులు సిద్ధమవగా, పోలీసులు అనుమతి నిరాకరించారు.
* అర్ధరాత్రి నుంచే ఆంక్షలు
ఉద్యోగులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచే తనిఖీలు చేపట్టారు. బస్సులు, రైళ్లలో విజయవాడకు వస్తున్న పలువురు ఉద్యోగులను మార్గమధ్యంలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఇవే ప్రధాన డిమాండ్లు
రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, పెండింగ్ వేతన బకాయిలను చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పదోన్నతుల సమస్యలను పరిష్కరించడం, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (ఏఏఎస్) అమలు చేయడం, కనీస మూల వేతనాన్ని పెంచడం, జీఓ నంబర్ 11ను రద్దు చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఇతర శాఖల పనులను తమపై మోపకుండా పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతున్నారు.
* పోలీసుల వివరణ
నగరంలో అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు, వర్షాలు, వరద పరిస్థితులు, వినాయక నిమజ్జన ఊరేగింపులు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ధర్నా, ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా నిరసనలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
