
ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పుల్లూరు సుధాకర్.
- తట్టెడు మట్టి తీయడం కూడా నేరం
- వడ్డెపల్లి చెరువు కట్ట హెరిటేజ్ సైట్
- వరంగల్ నగర పరిధిలో 250 చెరువులు, కుంటలు మాయం
- సుందరీకరణ పేరుతో విధ్వంసం జరుగుతోంది
- భద్రకాళి బండ్ పేరుతో చెరువు విస్తీర్ణాన్ని కుదించారు
- – పుల్లూరు సుధాకర్ , ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు
ఆకేరు న్యూస్, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మునిసిపాలిటీ (Greater Warangal Municipality ) అనాలోచిత పనుల వల్ల వరంగల్ నగర ప్రజలకు ముప్పు ముంచుకొస్తున్నది. వడ్డెపల్లి చెరువు కాకతీయుల కాలం నాటిది.. వందేళ్ళు దాటితేనే వారసత్వ కట్టడంగా గుర్తిస్తారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు పరిరక్షించడం మానేసి విధ్వంసం చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణ విఘాతమే కాదు, వరంగల్ నగర ప్రజలను ప్రమాదం అంచున ఉంచుతున్నారని ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ ( Forum for better Warangal ) వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ ( Pulluri Sudhakar ) మండి పడ్డారు. బ్యూటిఫికేషన్ పేరుతో వడ్డెపల్లి చెరువు కట్టను తవ్వేస్తున్నారు. .. అన్న ఆకేరు న్యూస్ కథనానికి ఆయన స్పందించారు. జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్ కలిసి వరంగల్ ప్రజలకు జరగబోయే నష్టాన్ని వివరిస్తానన్నారు. ఈ సంధర్భంగా ఆకేరు న్యూస్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
- ప్ర: సర్ , చెప్పండి .. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ అధికారులు వడ్డెపల్లి చెరువు కట్టను తవ్వి బ్యూటిఫికేషన్ పనులు చేస్తున్నారు కదా..? మీరేమంటారు..?
- పుల్లూరు సుధాకర్ : ఆకేరు న్యూస్ వెబ్ సైట్లో ఈ కథనాన్ని చదివాను. చాలా ఆశ్చర్యమే కాదు, భయం కూడా వేసింది. చెరువు కట్టను తవ్వడం ఏంటి .? తవ్వడం వల్ల చెరువు కట్ట మరింత బలహీనమవుతుంది కదా..? ఈ మాత్రం అవగాహన సాధారణ పౌరులకు సైతం ఉంటుంది. అధికారులకు మాత్రం ఎందుకు లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
- ప్ర: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులే కదా ..? వారికి ఈ మాత్రం అవగాహన లేదంటారా..?
- పుల్లూరు సుధాకర్ : అవగాహన లేదనను. రాజకీయ ఒత్తిళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి.ఇదీ అందరికీ తెలిసిన విషయమే.. ఎంత పెద్ద ఇంజనీర్లు అయినా కట్ట తవ్వి కట్టడాలు కట్టడం ఏంటి ..? ఇదే అధికారులు, భద్రకాళి చెరువు ( Bhadrakali tank ) లో ఎఫ్ టీఎల్ బయట కాకుండా లోపల ఎందుకు బండ్ నిర్మించారు. ఈ ఇంజనీరింగ్ అధికారుల వల్లనే కదా.. భద్రకాళి చెరువు కట్టకు గండి పడింది.. ఇపుడు వడ్డెపల్లి చెరువు ను టార్గెట్ చేస్తున్నారు.. అసలు నగరాన్ని ఏం చేయాలను కుంటున్నారు..
- ప్ర: బండ్ నిర్మాణం వల్లనే భద్రకాళి చెరువు మరింత పటిష్టంగా ఉందని అధికారులు అంటున్నారు కదా..? కాదంటారా..?
- పుల్లూరు సుధాకర్ : మరెందుకు గండి పడింది. ఇప్పటికీ పోతన నగర ప్రజలు భయం నీడనే ఉన్నారు కదా.. భద్రకాళి చెరువులో ఆక్రమణల వల్ల ఎఫ్టీఎల్ ( Full tank level ) లోపలే చాలా నిర్మాణాలు జరిగాయి. ఎఫ్ టీఎల్ ను వదిలేసి చెరువులోపల బండ్ నిర్మించారు. దీంతో చెరువు విస్తీర్ణం బాగా కుదించబడింది. చెరువుకు సంబందించిన ఇన్ ఫ్లో – అవుట్ ఫ్లో విదానం లోప భూయిష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో భద్రకాళి చెరువు పరిసర కాలనీలు నీట మునిగాయి. ఇక్కడ మాత్రం చెరువు కట్టను తవ్వడం, నిర్మాణం చేపట్టడం లాంటి పనులు మాత్రం చేయలేదు. గ్రీనరీని మాత్రం బాగా డెవలప్ చేశారు.
- ప్ర: సర్ , మీరు చెప్పండి ..అసలు వరంగల్ నగర ప్రజలకోసం విహార కేంద్రాలు ఉండకూడదంటారా..? చెరువులను సుందరీకరించి నగర ప్రజలకు ఒక టూరిజం స్పాట్ గా చేయాలన్న లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ అధికారులు రంగంలోకి దిగామని అంటున్నారు కదా..? కాదంటారా..?
- పుల్లూరు సుధాకర్ : వరంగల్ నగరం మరింత సుందరంగా ,పర్యాటక కేంద్రంగా విలసిల్లాలన్న లక్ష్యంతోనే మా ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చాలా ఏళ్ళుగా పోరాడుతున్నది. మా సంస్థ పేరులోనే బెటర్ వరంగల్ అని ఉన్నది కదా.. అంటే వరంగల్ ప్రజల ప్రయోజనాల కోసమే మా కార్యాచరణ ఉంటుంది. వరంగల్ నగర పరిధిలో 250 చెరువులు, కుంటలు ఆక్రమణకు గురై అడ్రస్ లేకుండా పోయాయి. వాటి గురించి గ్రేటర్ వరంగల్ మునిసిపల్ అధికారులు ఎందుకు ఆలోచించడం లేదు. అక్రమ నిర్మాణాలకు ఎందుకు అనుమతులిస్తున్నారు.. చెరువలన్నీ కాలనీలుగా మారాయి కాబట్టే వరద నీళ్ళన్ని నాటి చెరువులు నేటి కాలనీల్లోకి వెళుతున్నాయి. దీంతో వరంగల్ నగర ప్రజలు చిన్నపాటి వర్షానికి నీట మునుగుతున్నారు. ఇదంతా మునిసిపల్ అధికారుల పని విదానానిక తార్కాణాలే కదా..!

ప్ర: వడ్డెపల్లి చెరువు కట్టకు మునిసిపల్ అధికారుల వల్ల ఇపుడొచ్చిన ప్రమాదం ఏముందంటారు..?
- పుల్లూరు సుధాకర్ : చాలా ఉంది. ఈ ప్రమాదం గురించి నేను మాత్రమే అనడం లేదు. సాగునీటి శాఖ అధికారులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులకు లేఖ రాశారు. మీ చర్యల వల్ల ఇటీవల వచ్చిన వరదల వల్ల వడ్డెపల్లి చెరువు కట్ట కు ప్రమాదం ఏర్పడి వరంగల్ ప్రజలు నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ మునిసిపల్ అధికారులు స్పందించడం లేదు.
- ప్ర: వడ్డెపల్లి చెరువు కట్టను హెరిటేజ్ సైట్ గా ప్రభుత్వం గుర్తించిందంటారా..?
- పుల్లూరు సుధాకర్ : వడ్డెపల్లి చెరువు కాకతీయుల కాలం నాటిది . అంటే వందల సంవత్సరాల క్రితం ఈ చెరువును కాకతీయులు తవ్వించారు. మన చట్టాల ప్రకారం 100 ఏళ్ళు దాటిన కట్టడాలన్నీ వారసత్వ కట్టడాలుగానే గుర్తించాలి. హెరిటేజ్ సైట్ల కు సంబందించి నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ అనే విభాగాలుంటాయి. వడ్డెపల్లి చెరువు కట్ట నాన్ నోటిఫైడ్ హెరిటేజ్ సైట్‌గా పరిగణిస్తారు. ఈ కట్ట నుంచి తట్టెడు మట్టి తీసినా కూడా నేరమే అవుతుంది. అధికారులు కూడా కేసుల పాలవుతారు.
- ప్ర: వడ్డెపల్లి చెరువు కట్టను తవ్వకుండా పర్యాటక ప్రాంతంగా ఎలా అభివృద్ధి చేయాలంటారు..?
పుల్లూరు సుధాకర్ : నగరంలోని చెరువులు , కుంటలే కాకుండా నగరంలో ఉన్న గుట్టలను కూడా పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఎన్నో సార్లు అధికారులు వినతి పత్రాలు ఇచ్చాం.
1971 వరంగల్ మాస్టర్ ప్లాన్ ప్రకాంర వడ్డెపల్లి చెరువు కట్ట కింది భాగం అంతా పార్క్ ఏరియా గా గుర్తించారు. వడ్డెపల్లి చెరువు కట్టను తవ్వకుండా నే పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేయాలంటున్నాం.కాంక్రీట్ నిర్మాణాలు కాకుండా గ్రీనరీని పెంచి పార్క్‌లను అభివృద్ధి చేయాలి. ఫిల్లర్ల కోసం లోతైన రంధ్రాలు చేయడం వల్ల కట్ట బలహీన పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చెరువు కట్టలను తవ్వకుండానే పర్యాటక ప్రాంతంగా ఎలా అభివృద్ధి చేయాలో మన రాష్ట్రంలోనే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికైనా కట్టను తవ్వడం ఆపేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. -
వడ్డెపల్లి చెరువు కట్ట మీద నిర్మాణం ——————————————-