MGNREGA work timings change
* పని ప్రదేశాల్లో సౌకర్యాల కల్పనలో అలసత్వం వద్దు
* నిబంధనల అమలులో విఫలమైతే కఠిన చర్యలు – జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీను
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ఎండ తీవ్రత దృష్ట్యా, కూలీల ఆరోగ్య భద్రత కోసం ఉపాధి హామీ పని వేళల్లో కీలక మార్పులు చేస్తూ, ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను అన్నారు. బుధవారం కమలాపూర్ శివారులోని ఎర్రకుంటలో క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కూలీలకు గత మూడు నెలలుగా అందాల్సిన వేతనాలు ఈ వారంలోనే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఆయన భరోసా ఇచ్చారు. ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించి నిర్ణీత 307 రూపాయల వేతనాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే నెలాఖరు వరకు ప్రతి గ్రామంలో 100 నుండి 200 మంది కూలీలకు నిరంతరాయంగా ఉపాధి కల్పించాలని, గతంలో ఉన్న రికార్డులను మించి పని దినాలు పూర్తి చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాలను కల్పించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందిపైనే ఉందని స్పష్టం చేశారు. ఎటువంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కూలీ విధిగా తమ జాబ్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని, తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని,మొబైల్ యాప్ ద్వారా పని ప్రారంభం, ముగింపు సమయాల్లో హాజరు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు 90 రోజుల వేతనం చెల్లించడమే కాకుండా, గతంలో వ్యక్తిగత మరుగుదొడ్డి సదుపాయం పొందని వారికి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా చెరువుల పూడికతీత, కాలువల నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, పశువుల పాకలు, మహిళా సంఘాల , అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులను వెంటనే తీర్మానం చేసి, అంచనాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కనీసం ఐదు వేల మొక్కలు నాటడమే కాకుండా, గతంలో నాటిన మొక్కలలో చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటి, సంరక్షణ కోసం వాచర్లను నియమించాలని, గ్రామ నర్సరీల నిర్వహణపై పంచాయతీలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో గుండె బాబు, జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ ఐఈసి సంపత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఇతర ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
