* క్లిష్ట సమయాల్లో కీలక నిర్ణయాలు ఆయన సొంతం
* మాటల్లో మౌన ముని.. చేతల్లో సంస్కరణలకు ఆధ్యుడు
* సంకీర్ణ ప్రభుత్వాన్ని సామర్థ్యంతో నడిపిన నేత
* అమెరికాతో అణు ఒప్పందం అతిపెద్ద విజయం
* అతి బలహీనమైన ప్రధానిగా విపక్షాల విమర్శలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : తక్కువగా మాట్లాడడం.., దేశాభివృద్ధికి అవసరమైన సంస్కరణలు, ప్రణాళికలను అమలు చేసుకుంటూ పోవడం.. విమర్శలకు సున్నితంగా బదులివ్వడం.. ఆయన ప్రత్యేకత. అందుకే మౌన ముని అనేపేరుతో పాటూ.. గొప్ప ఆర్థిక వేత్తగానూ గుర్తింపు పొందారు. కీలక సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుండి నడిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టిన మేధావిగా ఆయనను చరిత్ర ఎప్పటికీ గుర్తించుకుంటుంది. ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ” మీడియా, ప్రతిపక్షాలు నన్ను ఎలా విమర్శించినా చరిత్ర నాపట్ల దయతో వ్యవహరిస్తుందని నేను నమ్ముతున్నా” అని చెప్పారు. అలాగే.. దేశ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన చేసిన తొలి ప్రసంగంలో “ఎవరికైనా టైమ్ వస్తే వారి ఆలోచనను ఏ శక్తి కూడా ఆపలేదు” అని విక్టర్ హ్యూగో వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అనూహ్యంగా వచ్చిన రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకుని దేశం గుర్తించే సంస్కరణలను అమలు చేశారు డా. మన్మోహన్ సింగ్.
చదువుకునే రోజుల్లోనే ఆర్థిక క్రమశిక్షణ
పంజాబ్ (ఇప్పటి చక్వాల్ , పాకిస్తాన్) లో 1932 సెప్టెంబరు 26న జన్మించారు మన్మోహన్ సింగ్. అతి సామాన్య కుటుంబం. ఆయన భార్య పేరు గురుశరణ్ కౌర్. వారికి ముగ్గురు కుమార్తెలు. వీరు ముగ్గురూ మతాంతర వివాహాలు చేసుకోవడం గమనార్హం. ఎన్నో సవాళ్లను అధిగమించి ఉన్నత చదువులు అభ్యసించారు. స్కాలర్షిప్లు, తండ్రి ఇచ్చిన నగదును పొదుపుగా వాడుకుంటూ ముందుకు సాగేవారట. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1952లో అర్థశాస్త్రములో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము లో బ్యాచిలర్స్, 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా దశలో ఉన్న సమయంలో..
అప్పటి వరకు కూడా రాజకీయంగాను, సామాజికంగాను ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ.. 1990ల్లోనే మన్మోహన్ ప్రతిష్ఠ పెరిగింది. అందుకు కారణం.. 1991లో కేంద్ర ఆర్థికమంత్రి అయిన తర్వాత ఆయన అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు. దేశ ఆర్ధిక వ్యవస్థ దివాలా దశలో ఉన్న సమయంలో ఆయన ఆ పదవి చేపట్టడమే సంచలనంగా మారింది. రాజనీతిజ్ఞుడు మన్మోహన్ కు ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్పణం మందగిస్తున్న సమయంలో మన్మోహన్ తెరపైకి తెచ్చిన సంస్కరణలు దేశంలో రాజకీయంగా ఆయన ప్రతిష్ఠ పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా దశలో ఉన్నప్పుడు ఆయన ఆ పదవి చేపట్టారు.1996 మే 15 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు పన్నుల్ని తగ్గించారు. రూపాయి విలువ నిలబెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దీంతో దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. పారిశ్రామిక రంగం ముందడుగు వేసింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. వృద్ధిరేటు స్థిరంగా కొనసాగింది. అయితే.. ప్రైవేటీకరణను, విదేశీ పెట్టుబడులను కొందరు వ్యతిరేకించారు. నాటి పరిస్థితుల్లో అవే ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతానికి కారణమయ్యాయని మెజార్టీ మంది కితాబిచ్చారు.
అనూహ్యంగా వరించిన పదవి
1990ల్లోనే మన్మోహన్ కు గుర్తింపు వచ్చినప్పటికీ, ఆయన రాజకీయ జీవితం 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారు, కార్యదర్శి వంటి ముఖ్యమైన పదవులను అధిరోహించారు. 2004లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా మన్మోహన్ను ప్రధాని పదవి వరించింది. తన ఇటలీ మూలాల విషయంలో పార్టీపై విమర్శలు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని పదవిని తిరస్కరించి, మన్మోహన్ సింగ్ కు అప్పగించారు. ఆ సమయంలో సింగ్ ప్రభుత్వం సమ్మిళిత వృద్ధిని, పేదరికం నిర్మూలనలో విజయం సాధించింది. అయితే మన్మోహన్ సింగ్ ఐదు సంవత్సరాల కాలంలో సగటున 7.7% వృద్ధిని సాధించడానికి ఆర్థిక వృద్ధిని కొనసాగించింది.
చివరి ప్రసంగం పెద్ద నోట్ల రద్దుపై
కాంగ్రెస్ రెండో సారి అధికారంలోకి రావడంతో మన్మోహనే మళ్లీ ప్రధాని అయ్యారు. 2014 వరకు ప్రధానిగా కొనసాగారు. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత, ప్రధానిగా ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ సింగ్ సాధించారు. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారధ్యం వహించారు. యూపీఏ-2 ఓటమి తర్వాత మన్మోహన్ సింగ్ ప్రతిపక్షనేతగా కాంగ్రెస్పార్టీని ముందుకు నడిపించారు. 1991లో రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఆయన ఎగువసభలోనూ ఐదుసార్లు అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. 2019లో రాజస్థాన్ కు మారారు. పెద్దనోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమైన దోపిడీలుగా ఆయన అభివర్ణించారు. 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నిరుద్యోగం, అసంఘటిత రంగం అతలాకుతలం అయ్యాయని ఆయన పార్లమెంట్లో చివరిసారి ప్రసంగించారు.
మరకలు..
రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంపై అనేక ఆరోపణలతో మన్మోహన్ ఎక్కువకాలం వార్తల్లో నిలిచారు. ద్రవ్యోల్బణం, అవినీతి కుంభకోణాల వంటి సమస్యలు అతని పరిపాలన విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఆయన క్యాబినెట్ మంత్రులు వేలకోట్ల రూపాయల కుంభకోణాల్లో చిక్కుకున్నారు. విధానాల పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించి.. తిరోగమనం బాటలో సాగిందని విమర్శలకు గురయ్యారు. అయితే మన్మోహన్ ప్రధాని అయినప్పటికీ సోనియాగాంధీనే నిజమైన అధికారకేంద్రంగా ఉన్నారనీ, ఆయనెప్పుడూ పూర్తిస్థాయి అధికార బాధ్యతలు నిర్వహించలేదని విమర్శకులు ఆరోపించేవారు. ఓ సందర్భంలో పార్లమెంట్లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ మాట్లాడుతూ.. భారత్లో అతి బలహీనమైన ప్రధాని మన్మోహన్ సింగ్ అని విమర్శించారు. అయితే మన్మోహన్ సింగ్ తన పాలనను సమర్థించుకున్నారు. దేశంకోసం, ప్రజల సంక్షేమం కోసం అంకితభావం, నిబద్ధతతో పనిచేశామని మన్మోహన్ సింగ్ తెలిపారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
