* రోడ్లపైకి పరుగులు తీసిన జనం
* ఆందోళన అవసరం లేదన్న అధికారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ శివారు ప్రాంతంలో భూకంపం.. ఆందోళనతో ప్రజలు రోడ్డు మీదకు పరుగులు తీశారు. పలు శివారు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. మంగళవారం ఉదయం సుమారు 10:10 గంటల సమయంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రధానంగా గాజులరామారం, కుత్బుల్లాపూర్, మెట్టుకానిగూడ, అక్షిత ఎన్క్లేవ్, హెచ్ఏఎల్ (HAL) కాలనీ, దేవేందర్ నగర్ ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 1.5 నుండి 2.0 మధ్య నమోదైనట్లు తెలుస్తోంది . భూకంప కేంద్రం మేడ్చల్ జిల్లాలోని గాజులరామారం – కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భూమికి సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. కాగా సుమారు 3 నుండి 5 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రకంపనల సమయంలో భూమి లోపల నుండి పెద్ద శబ్దం వచ్చినట్లు ప్రజలు చెబుతున్నారు . దీంతో అపార్ట్మెంట్ల్ ల లోని నివాసితులు భూకంపం వచ్చిందని భావించి మెట్ల ద్వారా కిందకు పరుగులు తీశారు. భూ ప్రకంపనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా గాజులరామారం పరిసరాల్లోని కొన్ని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించి, విద్యార్థులను ఇళ్లకు పంపించాయి. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల వద్ద ప్రజలు గుంపులుగా చేరి అసలు ఏం జరిగిందోనని చర్చించుకుంటున్న దృశ్యం కనిపించింది.
* ఆందోళన వద్దు
హైదరాబాద్ నగరం సాధారణంగా సీస్మిక్ జోన్-II (Zone II) లో ఉంది. ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ ప్రకంపనలు కేవలం భూకంపం వల్ల వచ్చాయా? లేదా స్థానికంగా ఏదైనా పేలుడు పదార్థాల వల్ల (Blasting) సంభవించాయా ? అనే కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.రిక్టర్ స్కేలుపై 2.0 కన్నా తక్కువ తీవ్రత ఉంటే భవనాలకు లేదా ఆస్తులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కేవలం కిటికీలు ఊగడం లేదా చిన్నపాటి శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదని, ఇవి కేవలం స్వల్ప ప్రకంపనలేనని అధికారులు ధృవీకరించారు. అయితే పాత భవనాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
—————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
