శ్రీ వెంకటేశ్వర కళ్యాణం
.. గోవింద నామస్మరణతో హోరెత్తిన చిల్పూర్
ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం గోవింద నామ స్మరణ మధ్య రంగ రంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఈవో లక్ష్మీ ప్రసన్న ఉత్సవమూర్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతిలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. గుట్టపై ఉన్న ప్రధాన ఆలయం నుండి స్వామి వారి ఉత్సవమూర్తులను మేళ తాళాలు, డప్పు చప్పులు, కోలాటాలు ప్రత్యేక వేషధారణ కళాకారుల స్వాగతంతో కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆరుట్ల రాకేష్ కుమార్ ఆచార్యులు (యజ్ఞకుల) ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు కమనీయం కడు రమనీయం అన్న విధంగా సాగింది. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణల మధ్య చిల్పూర్ గుట్ట మారుమొగింది.
” కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కావ్య”
చిల్పూర్ మండల కేంద్రంలోని చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవ కార్యక్రమాలను తిలకిస్తూ భక్తులతో కలిసి భక్తిసేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. చిల్పూర్ గుట్ట ఆలయం ప్రాంత ప్రజలకే కాకుండా పరిసర జిల్లాల భక్తులకు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు ధర్మకర్త మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అర్చకులు రవీంద్ర శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
” అన్నదాన వితరణ”
కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు వైద్య సేవలు, త్రాగునీరు, మజ్జిగ సరఫరాతోపాటు అన్నదాన వితరణ చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ వాస్తవ్యుడు పులవర్తి నరేంద్ర, భువనేశ్వరి దంపతులు అన్నదాన వితరణకు ఆర్థిక చేయూతనిచ్చారు.
