ఆకేరు న్యూస్, యాదాద్రి భువనగిరి: జిల్లాలోని బీబీనగర్ మండల పరిధిలో గొల్లగూడెం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఓ తల్లి, తన ఇద్దరు పసిబిడ్డలను ప్రాణ తీసి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు మరియు బంధువుల కథనం ప్రకారం.. గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల ఐశ్వర్య, మహేష్ యాదవ్ దంపతులకు వివాహం జరిగి కొన్ని ఏళ్లు అవుతోంది. మహేష్ రైల్వే శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం..రెండేళ్ల కుమార్తె, పది నెలల కుమారుడు.
గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఐశ్వర్య, ఆదివారం రోజున పిల్లలతో కలిసి తన పుట్టింటికి (వేములకొండ) వెళ్లిపోయింది. అయితే, పెద్దమనుషులు మరియు కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పి తిరిగి అత్తవారింటికి పంపించారు. ఘోరం జరిగిందిలా.. పుట్టింటి నుంచి తిరిగి వచ్చిన అదే రోజు రాత్రి, మనస్తాపం తగ్గని ఐశ్వర్య దారుణ నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి సమయంలో ఏమీ తెలియని తన ఇద్దరు పసిపిల్లలను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న బీబీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భర్తతో ఏర్పడిన మనస్పర్థలే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. అయితే, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి బిడ్డలతో సహా తల్లి మృతి చెందడంతో గొల్లగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
