యూఏఈ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభం…
ఢిల్లీ చేరిన తొలి విమానం!!
ఆకేరు న్యూస్, డెస్క్: పశ్చిమాసియాలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భీకర యుద్ధానికి దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులు భారతీయ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ చేపట్టిన డ్రోన్, క్షిపణి దాడుల ధాటికి సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలు చిక్కుకున్నాయి. ఒమన్ తీర సమీపంలో జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ అధికారికంగా వెల్లడించారు.
ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఈ మరణాలను ధృవీకరించింది. మృతి చెందిన వారు అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్నారని, రెండు వేర్వేరు నౌకలపై జరిగిన దాడుల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
ఇది ఇలా ఉండగా……మరోవైపు, యుద్ధ క్షేత్రంగా మారుతున్న గల్ఫ్ దేశాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా యూఏఈ (UAE) నుంచి భారతీయుల తరలింపు అధికారికంగా ప్రారంభమైంది. అబుదాబి నుంచి బయలుదేరిన Etihad Airways ప్రత్యేక విమానం సుమారు 300 మంది భారతీయులతో ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది.
గత మూడు రోజులుగా భద్రతా కారణాల దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన అధికారులు, పరిస్థితులు కొంత మెరుగుపడటంతో సేవలను పునఃప్రారంభించారు. ఇప్పటివరకు మొత్తం నాలుగు విమానాలు భారత్కు చేరుకున్నాయి. ముంబై, బెంగళూరు, కొచ్చి విమానాశ్రయాల్లో కూడా రాత్రి సమయంలో ప్రత్యేక విమానాలు ల్యాండ్ అయ్యాయి.
స్వదేశానికి చేరుకున్న ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికి, వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన రవాణా మరియు భోజన సదుపాయాలను కల్పించారు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు ఎప్పుడు నిలిచిపోతాయో తెలియని పరిస్థితుల్లో, మిగిలిన భారతీయులను కూడా యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
