ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలోని 70 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. గ్రామంలోని వంక బోడు శివారు ప్రభుత్వ భూమిలో జెసిబి ద్వారా చెట్లను తొలగించడం దీనికి నిదర్శనం. గ్రామ శివారులోని వంక బోడు సమీపంలో దాదాపు 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో ఐదు ఎకరాల భూమిని రిటైర్డ్ ఆర్మీ జవాన్ కు కేటాయించగా మిగిలిన 65 ఎకరాల్లో కొంతమంది గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసనల్లో మంగళవారం పిచ్చి చెట్లను తొలగించి చదును చేస్తున్న ఫోటోలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మరి ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నట్లు పక్క సమాచారం. ఈ విషయాన్ని మండల తాసిల్దార్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
