RTC driver shankar goud cm revanth
* ఆర్టీసీ కార్మికులకు కీలక సందేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TG-RTC) డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శంకర్‌గౌడ్ బలవన్మరణానికి పాల్పడటం అత్యంత బాధాకరమని, ఆయన మృతి పట్ల సీఎం సంతాపం ప్రకటించారు.
* కుటుంబానికి ప్రభుత్వ భరోసా
శంకర్‌గౌడ్ మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. శంకర్‌గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఈ కష్టాన్ని తట్టుకునేలా భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు.
* క్షణికావేశ నిర్ణయాలు వద్దు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశంలో తీసుకునే తీవ్ర నిర్ణయాలు కుటుంబాలను కోలుకోలేని విషాదంలోకి నెడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు.
* సమస్యలపై స్పష్టత
ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతుందని, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామని వివరించారు. ఎవరూ అధైర్యపడవద్దని, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
