BRS 26th Formation Day telangana
* తెలంగాణ భవన్కు కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ యవనికపై చెరపలేని ముద్ర వేసిన భారత రాష్ట్ర సమితి (BRS) నేడు 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’ గులాబీ మయంగా మారింది. సోమవారం ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు ( KTR ) పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
* హాజరైన ముఖ్య నేతలు
ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు మరియు పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తెలంగాణ భవన్ కిక్కిరిసిపోయింది. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.
* కేసీఆర్ కీలక సమావేశం
ఉదయం కేటీఆర్ జెండా ఆవిష్కరణ అనంతరం, మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు (KCR) తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. సుమారు 300 మంది ముఖ్య నేతలతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమీక్షించి పార్టీ భవిష్యత్ కార్యాచరణ మరియు ప్రజా పోరాటాలపై దిశానిర్దేశం చేస్తారు. సభ్యత్వ నమోదు మరియు సంస్థాగత మార్పులపై చర్చ. పార్లమెంటు ఎన్నికల అనంతర పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పోరాటాలకు ప్రణాళికను రూపొందిస్తారు.
*రజతోత్సవ సంబరాల ముగింపు
బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఈ ఏడాది వేడుకలకు ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. గడిచిన పాతికేళ్లలో పార్టీ ప్రస్థానం, తెలంగాణ సాధనలో పోషించిన పాత్ర మరియు దశాబ్ద కాలం నాటి పాలనను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణంలో గులాబీ జెండాలు రెపరెపలాడాయి.
———————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
