Modi Revanth Telangana Development
* పెద్ద మనసు చూపండన్న రేవంత్ రెడ్డి
* బదులుగా కలిసి నడవాలన్న మోది
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదని, కేంద్రం సహకరిస్తే రాష్ట్రాన్ని దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM REVANTH REDDY ) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ (HICC) వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ( PM NARENDRA MODI ) సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఇద్దరు నేతల మధ్య జరిగిన నిధుల చర్చ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అభివృద్ధి విషయంలో పెద్ద మనసు చూపండని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కోరారు. ప్రతిగా మాతో కలిసి నడిస్తేనే అభివృద్ది సాధ్యం అంటూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలకు అనేక అర్థాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
* గుజరాత్ మోడల్ – తెలంగాణ రైజింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్ ను ఎలా అభివృద్ధి చేశారో గుర్తుచేశారు. అదే రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ పెద్ద మనసు తో సహకరించాలని కోరారు.
తెలంగాణ దేశ జనాభాలో 3శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీకి 5శాతం సహకారం అందిస్తోంది. దీనిని 10శాతం కు చేర్చడమే మా లక్ష్యం. గుజరాత్‌కు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసినట్లే, తెలంగాణకు కూడా నిధుల వరద పారించాలి” అని సీఎం వ్యాఖ్యానించారు.
* మేరే సాత్ జుడే రహో
సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల గురించి మాట్లాడనన్నారు కాబట్టి, నేను కూడా రాజకీయేతరంగానే సమాధానం ఇస్తాను. అంటూ చమత్కరించారు. గతంలో గుజరాత్‌కు కేంద్రం ఇచ్చిన నిధులే తెలంగాణకు కావాలని సీఎం అడిగారు. అయితే, ప్రస్తుతం తెలంగాణకు అందుతున్న నిధులు, గతంలో గుజరాత్‌కు అందిన దానికంటే రెట్టింపు ఉన్నాయని ప్రధాని గణాంకాలతో వివరించారు. ఒకవేళ పాత పద్ధతిలో నిధులు ఇస్తే, ఇప్పుడు వస్తున్న దాంట్లో సగానికి తగ్గిపోతాయని, అది తెలంగాణకు నష్టమని సరదాగా వ్యాఖ్యానించారు. “రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో కలిసి నడవాలి (మేరే సాత్ జుడే రహో)” అని పిలుపునిచ్చారు. మేరే సాత్ జుడో రహో అని వ్యాఖ్యకు అనేక అర్థాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి సత్తా ఉంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు కేవలం రూ. 1,000 కోట్లు కేటాయిస్తే, గత పదేళ్లలో తెలంగాణకు *రూ. 5,500 కోట్లు కేటాయించామని నరేంద్ర మోది వెల్లడించారు. తెలంగాణకు ఇప్పటికే 5 వందే భారత్ ,అర డజనుకు పైగా అమృత్ భారత్ రైళ్లను అందించామన్నారు . వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న పీఎం మిత్ర (PM MITRA) మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా గూడెబల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు రూ. 3,175 కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మారుస్తుందని మోదీ అన్నారు.
హైదరాబాద్‌కు కేవలం జాతీయ స్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందే సత్తా ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ నగరం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు.
——————————–
