Usman Pushes Feroz Khan Congress Leaders Clash Hyderabad
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ వేదికగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ కార్యాలయంలో నేతలు వీధిరౌడీల్లా ప్రవర్తించారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్‌ఖాన్, కార్వాన్ నేత ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్తా భౌతిక దాడికి దారితీసింది. మంత్రులు, సీనియర్ నాయకుల సమక్షంలోనే ఇరువర్గాలు చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడంతో గాంధీభవన్ ఒక్కసారిగా రసాభాసగా మారింది.
* ప్రోటోకాల్ వివాదం…
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు గాంధీభవన్‌లో కీలక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభమయ్యే సమయంలో ప్రొటోకాల్ రగడ మొదలైంది. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
* కుర్చీ లాగారు.. కిందపడేశారు…
మాట మాట పెరగడంతో ఇద్దరు నేతలు సహనం కోల్పోయారు. ఒకరినొకరు దూషించుకుంటూ చొక్కాలు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఉస్మాన్ ఆల్ హాజ్రీ ఆగ్రహంతో ఫిరోజ్‌ఖాన్‌ను గట్టిగా పక్కకు తోసేయడంతో ఆయన కిందపడిపోయారు. దీంతో ఇరువర్గాల అనుచరులు ఒక్కసారిగా ఒకరిపైకి ఒకరు దూసుకువచ్చారు.
* సీనియర్ నేత వీహెచ్‌పైనా తోపులాట..
పరిస్థితి చేదాటిపోతుండటంతో అక్కడే ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే, ఆవేశంలో ఉన్న నేతలు సీనియర్ అని కూడా చూడకుండా వీహెచ్‌ను సైతం పక్కకు తోసేసే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన మిగతా నాయకులు, భద్రతా సిబ్బంది మధ్యలో దూరి ఇరువర్గాలను విడదీశారు.
* సమావేశం అర్థాంతరంగా రద్దు..
మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కళ్లముందే ఈ హైడ్రామా అంతా నడిచింది. నగర నేతల తీరుపై తీవ్ర అసహనానికి గురైన మంత్రులు, సమీక్షా సమావేశాన్ని కొనసాగించడం సాధ్యం కాదని భావించి సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి అక్కడి నుంచి వెనుదిరిగారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ ఘర్షణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలే ఇలా మంత్రుల ముందే కొట్టుకోవడంపై అధిష్ఠానం సీరియస్ అయినట్లు సమాచారం.
