Sachin Vaibhav Suryavanshi Test Cricket
ఆకేరు న్యూస్, డెస్క్: భారత క్రికెట్లో కొత్త సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ 15 ఏళ్ల యువ ఆటగాడి బ్యాటింగ్‌ను సచిన్ “అద్భుతం” అని కొనియాడారు.
ముంబైలో జరిగిన క్రిక్ఇన్ఫో అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్.. వైభవ్ ప్రతిభపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం భారత క్రికెట్లో అందరి దృష్టి వైభవ్పైనే ఉందని పేర్కొన్నారు.
* వైభవ్‌లో నన్ను ఆకట్టుకున్నది అదే..
“వైభవ్ బ్యాటింగ్‌ను నేను చూశాను. అతడు నిజంగా ప్రత్యేకమైన ఆటగాడు. కేవలం బంతిని బలంగా కొట్టడం మాత్రమే కాదు.. అతని మణికట్టు వినియోగం నన్ను బాగా ఆకట్టుకుంది. మైదానం నాలుగు వైపులా షాట్లు ఆడాలంటే అద్భుతమైన రిస్ట్ వర్క్ అవసరం. వైభవ్‌లో ఆ నైపుణ్యం కనిపిస్తోంది” అని సచిన్ తెలిపారు.
అతడు బంతిని గుడ్డిగా బాదడం లేదని, బౌలర్ లైన్, లెంగ్త్‌ను ముందుగానే అంచనా వేసి సులభంగా భారీ షాట్లు ఆడుతున్నాడని పేర్కొన్నారు.
* టెస్టు క్రికెట్‌పై సచిన్ ఏమన్నారంటే..
వైభవ్ త్వరలో భారత జట్టులోకి రావాలా? టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడా? అనే ప్రశ్నలకు కూడా సచిన్ స్పందించారు.
“అతడికి నేను చెప్పేదొక్కటే.. తన సహజమైన ఆటను మార్చుకోవద్దు. అతడిలానే ఉండాలి. ప్రతి ఆటగాడికి మొదటిసారి ఉంటుంది. టెస్టు క్రికెట్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. అయితే వాటికి పరిష్కారాలు కనుగొనడం నేర్చుకోవాలి” అని సూచించారు.
* ఒత్తిడి పెట్టొద్దంటున్న సచిన్
వైభవ్‌పై ఇప్పుడే అధిక అంచనాలు పెట్టడం సరికాదని సచిన్ అభిప్రాయపడ్డారు. ఏ జట్టులో ఆడాలి, ఎప్పుడు ఎంపిక కావాలి అనే విషయాలను సెలెక్టర్లకే వదిలేయాలని అన్నారు.
“అతడు భవిష్యత్తులో టెస్టు క్రికెట్ ఆడాలని అందరూ కోరుకుంటారు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ఇలాంటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలి. అనవసర ఒత్తిడి మాత్రం సృష్టించకూడదు” అని పేర్కొన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా తన బ్యాటింగ్‌తో అభిమానులను సంపాదించుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం నుంచి ప్రశంసలు అందుకోవడం విశేషం. దీంతో ఈ యువ క్రికెటర్ భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఎదుగుతాడనే అంచనాలు మరింత పెరిగాయి.
