Kamalapur History Telangana Movement
* నాడు ఉద్యమ ఉప్పెన – నేడు స్వరాష్ట్ర సంబరం
* ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చారిత్రాత్మక ఉప్పల్ రైల్ రోకో
* గ్రామ జేఏసీల వ్యూహాత్మక పోరాటం
* నాటి ఉద్యమ ప్రస్థానం నేడు జ్ఞప్తికి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర పోరాట చరిత్రను తిరగేస్తే, కొన్ని ప్రాంతాలు కేవలం భౌగోళికంగా మాత్రమే కాకుండా ఉద్యమ గుండె చప్పుడుగా కనిపిస్తాయి. అలాంటి ఒక చరిత్ర కమలాపూర్ మండలానికిీ ఉంది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన తొలినాళ్లలోనే మండలం ఉద్యమానికి కొండంత అండగా నిలిచింది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే కావాలి అనే ఆకాంక్ష ఈ మండల ప్రజల నరనరాల్లో ప్రవహించింది.
ఉద్యమానికి వెన్నుదన్నుగా నాటి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రతినిధిగా, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా, ఉద్యమ సారథిగా ఉన్న ఈటల రాజేందర్ కు కమలాపూర్ మండలం ఒక బలమైన కోటగా ఉండేది. ఆయన పిలుపునిస్తే చాలు, కష్టనష్టాలను సైతం లెక్కచేయకుండా వేలాది మంది జనం తరలివచ్చేవారు.
* గ్రామ జేఏసీల ఆధ్వర్యంలో
రాజకీయాల్లో వచ్చిన మార్పులతో జేఏసీ ఏర్పాటుతో కమలాపూర్ మండల జేఏసీ (JAC), ఉప్పల్ , ఇతర గ్రామాల జేఏసీలు ఏర్పాటయి ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. అప్పట్లో జేఏసీలో ఉన్న వారంతా 30 ఏళ్లు దాటని యువకులే అయినప్పటికీ, వారు ఉద్యమాన్ని ఉరకలెత్తించారు.
* ప్రధాన రహదారుల రాస్తారోకోనే అస్త్రంగా
మండల వ్యాప్తంగా హుజురాబాద్ – పరకాల, ప్రధాన రహదారులపై ఎండా వాన తేడా లేకుండా సుమారు 50 రోజులపాటు రాస్తారోకోలు జరిగాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయేలా, రోడ్లపైనే వంటావార్పులు చేస్తూ, మానవహారాలుగా ఏర్పడి పాఠశాల విద్యార్థులు, ప్రజలు తమ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటారు. కుల – మతాల భేదం లేకుండా స్వరాష్ట్ర సాధన కోసం సకల జనులు రోడ్డుపైకి వచ్చారు. ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయని ఉద్యమ ద్రోహులను నిరసిస్తూ డప్పు కళాకారులు చావు డప్పు కొడుతూ ధర్నాలు చేశారు. వడ్రంగులు రోడ్డుపైనే కర్ర చెక్కలతో గుడిసెలు వేయగా, మున్నూరు కాపులు ఎడ్ల బండ్లు కట్టి భారీ ర్యాలీ చేశారు. నాయీ బ్రాహ్మణులు రోడ్డుపైనే సెలూన్ దుకాణాలు నడిపిస్తూ నిరసన తెలిపారు. కురుమ కులస్తులు వినూత్న రీతిలో ఒగ్గు డోలు నృత్యాలతో రోడ్డుపై పట్నాలు వేసి ఆరాటపడ్డారు. ట్రాక్టర్ , ప్రోక్లైన్ యూనియన్లు వారి భారీ వాహనాలతో వినూత్నంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. కమలాపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 100 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి ఆత్మగౌరవ సభకు తరలివెళ్లారు.
* 13 కిలోమీటర్ల మేర ప్లకార్డుల ప్రదర్శన
ఉప్పల్ నుండి శనిగరం వరకు తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మండల శాఖ ఆధ్వర్యంలో సుమారు 20,000 మందితో 13 కిలోమీటర్ల మేర చేపట్టిన ప్లకార్డుల ప్రదర్శన నాటి ఉద్యమ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలిచింది.
* ఎన్నటికీ మర్చిపోలేని ఉప్పల్ రైల్ రోకో
ఉప్పల్ గ్రామంలో 3 రోజుల ఆమరణ నిరాహార దీక్ష , 45 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇదే క్రమంలో ఢిల్లీ పీఠం కదిలేలా రైలు చట్రాలను సైతం స్తంభింపజేసింది ఉప్పల్. మలిదశ ఉద్యమంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కుదిపేసిన భారీ రైలు రోకో 2009 డిసెంబర్ 7న ఉప్పల్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఢిల్లీకి వెళ్ళవలసిన ప్రముఖ రాజధాని ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్ రైళ్లను ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టాలపైనే నిలిపివేశారు. ఉద్యమకారులు రైలు పట్టాలనే ఇల్లుగా మార్చుకుని, అక్కడే పొయ్యిలు పెట్టి వంటా-వార్పు చేశారు. విద్యార్థులు ఆడి, పాడారు. పోలీసులు బెదిరించినా, జైలు పాలవ్వడానికైనా సిద్ధపడ్డారే తప్ప వెనక్కి తగ్గలేదు. ఈ ఉప్పెన లాంటి ఉద్యమం జరిగిన రెండు రోజులకే, అంటే డిసెంబర్ 9న, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ 2011 సెప్టెంబర్ 24న రెండు రోజుల రైల్ రోకోలో మరోసారి ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఈటెల రాజేందర్ పాల్గొని పట్టాలపై నిద్రించారు. ఇచ్చిన మాట తప్పితే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఢిల్లీని హెచ్చరించారు.
* రైలు రోకోకు పాఠశాల విద్యార్థుల యత్నం
2011 ఫిబ్రవరి 22న తెలంగాణ ఐకాస (JAC) ఇచ్చిన బంద్ పిలుపుమేరకు ఉప్పల్ పాఠశాల విద్యార్థులు స్వచ్ఛందంగా క్లాసులను బహిష్కరించి రైల్ రోకోకు ప్రయత్నించగా, అప్పటి జమ్మికుంట రూరల్ సీఐ గౌస్ బాబా, పోలీసులు వారిని అడ్డుకుని నచ్చజెప్పి వెనక్కి పంపారు.
* మండల వ్యాప్తంగా బంద్ లు ప్రశాంతం
2011 ఫిబ్రవరి 23న, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపుతో కమలాపూర్ మండలంలో రెండు రోజుల పాటు బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా కొనసాగింది.
నాడు రైలు పట్టాలపై, రాస్తా రోకో లపై ఎగిరిన ఆత్మగౌరవ జెండా, నేడు జూన్ 2న స్వరాష్ట్ర సంబరాల్లో సగర్వంగా రెపరెపలాడుతోంది.తెలంగాణ ఉద్యమ చరిత్ర పుటలను ఎప్పుడు తిరగేసినా.. కమలాపూర్ మండలం పోరాటాల ప్రతీకగా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
