AP Deputy CM Pawan Kalyan Telangana Comments
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మరియు రాష్ట్రంపై జనసేన పార్టీ వైఖరిపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణపై తనకు ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించడమే కాకుండా, తనను విమర్శిస్తున్న, బెదిరిస్తున్న నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “నన్ను బెదిరించేవారికి ఒకటే చెబుతున్నా.. నా ఇంటి అడ్రస్ చెప్పడానికే ఇక్కడ ప్రెస్మీట్ పెట్టాను” అంటూ పవన్ సవాల్ విసిరారు.
* మీ అయ్య జాగీరా తెలంగాణ…
“తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతుందని కొందరు అడుగుతున్నారు. అసలు జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్ నడిబొడ్డున. ఇది తెలంగాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదు. ఇప్పుడు విమర్శించే గొంతులు 2007లో ఎక్కడ ఉన్నాయి?” అని పవన్ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు, ఇక్కడి నాయకులకు ఏపీ ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని, కొందరు ఉద్దేశపూర్వకంగానే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. “హైదరాబాద్లో ఎలా అడుగుపెడతారని అడుగుతున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? మీరెవరు నన్ను బెదిరించడానికి?” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
* ఆక్రమణలు ఉంటే సీజ్ చేయండి..
తాను చెరువులను ఆక్రమించానని వస్తున్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ స్పష్టతనిచ్చారు. “నేను చెరువును ఆక్రమించానని అనుకుంటే ఈ రోజే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా. నేను ప్రాపర్టీ ఆక్రమించి ఉంటే నిరభ్యంతరంగా సీజ్ చేసుకోండి” అని స్పష్టం చేశారు.
అలాగే గద్దర్ బతికున్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదని.. ఆయన బుల్లెట్లు దిగి నడవలేక ఒక బండి కొనివ్వమని అడిగితే, తాను మూడ్రోజుల్లో బండి కొనిచ్చానని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
* తెలంగాణపై నా కమిట్మెంట్ ఇదే..
“తెలంగాణలో ఉపాధి లేకపోతే దానికి పవన్ కల్యాణ్ కారణమా? ఒకవేళ ఇక్కడ అన్యాయం చేసేవారు ఉంటే ఉరి తీయండి.. అందులో పవన్ కల్యాణ్ ఉన్నా సరే ఉరితీయండి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణపై తనకు పూర్తి కమిట్మెంట్ ఉందని, అందుకే కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లు, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు రూ.కోటి సహాయం అందించానని తెలిపారు. తనపై తొలి కేసు నమోదైందే తెలంగాణలోనని, మహబూబ్నగర్, ఖమ్మం ప్రాంతాల్లో దాడులు జరిగినా తట్టుకుని నిలబడ్డామని.. ‘తాటాకు చప్పుళ్లకు’ తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. నాలుక కోస్తామంటున్న కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి.. “ఎవరొస్తారో రండి.. నా నాలుక చూపిస్తా” అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
* 2029 ఎన్నికలు.. జీహెచ్ఎంసీపై ఫోకస్..
రాబోయే ఎన్నికలపై జనసేనాని కీలక ప్రకటన చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అప్పటికి ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. తాను వ్యక్తిగతంగా తెలంగాణలో పోటీ చేయనని, కానీ తన పార్టీ అభ్యర్థులు గెలిస్తే అదే తనకు పెద్ద సంతోషమని చెప్పారు.
అలాగే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా వెళ్తే.. జనసేన కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, తెలంగాణ అంతటా తాను స్వయంగా పర్యటిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
