Loan Recovery Harassment Hyderabad
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో ఐటీ కారిడార్‌కు తలమానికంగా నిలిచిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై మరో విషాదం చోటుచేసుకుంది. ఓ యువతి వంతెనపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడింది. లోన్ రికవరీ ఏజెంట్ల మానసిక వేధింపులు తట్టుకోలేకే సదరు యువతి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని నాగోల్ ప్రాంతానికి చెందిన రోజా రమణి (26) మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. తమ కూతురు కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
* సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు…
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోజా రమణి మొబైల్ సిగ్నల్స్, ఆమె ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఉన్న నిఘా కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా షాకింగ్ నిజం వెలుగుచూసింది. రోజా రమణి కేబుల్ బ్రిడ్జి పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు నిర్ధారించారు.
* వేధింపులే ప్రాణం తీసాయా..
యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రోజా రమణి కొన్ని ఆన్లైన్ యాప్స్ లేదా ఇతర మార్గాల ద్వారా లోన్ తీసుకున్నట్లు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ లోన్ రికవరీ ఏజెంట్లు ఆమెను గత కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో పాటు వ్యక్తిగతంగాను లీగల్ మరియు సోషల్ వేధింపులకు గురిచేయడం వల్లే మనస్తాపానికి గురై ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, యువతి మొబైల్ డేటాను, కాల్ హిస్టరీని విశ్లేషిస్తున్నారు. రికవరీ ఏజెంట్ల వేధింపుల కోణం నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
